జీడిమెట్లలో ఒకేరోజు రెండు పేలుళ్లు.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు - Jeedimetla explosions
22:20 June 01
జీడిమెట్లలో ఒకేరోజు రెండు పేలుళ్లు.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
హైదరాబాద్ జీడిమెట్ల సుభాష్‌నగర్ ప్రాంతంలోని వెంకటాద్రినగర్‌లో పేలుళ్లు కలకలం రేపాయి. రాజరాజేశ్వరి ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో రాత్రి ఒక్కసారిగా భారీ శబ్ధం వచ్చింది. సమీపంలో నివాసముంటున్న వారు.. ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. చీకటిగా ఉండటంతో అగ్గిపుల్లను వెలిగించి చూస్తుండగా.. మరోసారి పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఐదుగురు స్థానికులు గాయపడ్డారు. దయానంద్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.. గుర్తు తెలియని పౌడర్ పేలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎవరు పడేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు సుభాష్‌నగర్‌లోనే బుధవారం ఉదయం మరో పేలుడు సంభవించింది. ఫైర్ సేఫ్టీ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లో అక్రమంగా రీఫిల్ చేస్తుండగా పేలుడు జరిగింది. ప్రమాదంలో ముకుంద్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా.. సంబంధిత అధికారుల్లో చలనం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ, దూలపల్లి, సుభాష్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరతామని మాజీ కార్పొరేటర్ సురేశ్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా జీడిమెట్లలో తరచూ పేలుళ్లు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవటంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.
ఇదీ చూడండి: