ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు కుటుంబాల మధ్య వివాదం ముదిరి.. ఉదయం 8 గంటల సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. బంధువులైన పార్థసారధి రెడ్డి, శివప్రసాద్ రెడ్డి కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శివప్రసాద్ రెడ్డి ఇంటిపైకి పార్థసారధిరెడ్డి కత్తితో దాడికి యత్నించారు. చంపుతాడేమో అన్న భయంతో.. శివప్రసాద్ రెడ్డి తన దగ్గర ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో పార్థసారధిరెడ్డిపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం శివప్రసాద్ రెడ్డి అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు వదిలారు. పులివెందుల ఆస్పత్రిలో రెండు కుటుంబాలనూ వైఎస్ కుటుంబీకులు పరామర్శించారు. ఘటనకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు.
చంపుతాడేమో అన్న భయంతోనే కాల్పులు..!
పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు శివప్రసాద్ రెడ్డికి ఆయన ఇంటి ఎదురుగా ఉండే దగ్గరి బంధువు పార్థసారథి రెడ్డికి మధ్య గత మూడేళ్ల నుంచి వివాదం నడుస్తోంది. ఇది మనసులో పెట్టుకున్న పార్థసారధి రెడ్డి గత పదిరోజుల నుంచి శివప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులపై దాడికి యత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే సందర్భంలోనే ఇవాళ ఉదయం పార్థసారధి రెడ్డి వేటకొడవలి తీసుకుని శివప్రసాద్ రెడ్డి కుమారుడిపై దాడికి యత్నించాడు. ఈ సమయంలో శివప్రసాద్ రెడ్డి అడ్డుపడి తన వద్దనున్న లైసెన్స్ తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ వినకుండా దాడికి యత్నించడంతో.. శివప్రసాద్ రెడ్డి మొదట తుపాకీతో ఓ రౌండు పక్కకి కాల్చి భయపెట్టాలని చూసినా పార్థసారధి రెడ్డి పెనుగులాట చేస్తూనే ఉన్నాడు. తన కుమారున్ని, తనను కొడవలితో చంపుతాడేమోననే భయంతో నేరుగా పార్థసారధిరెడ్డిపై కాల్పులు జరిపాడు శివప్రసాద్ రెడ్డి. తుపాకీ తుటాలకు.. పార్థసారధి అక్కడికక్కడే ఇంటి గడప వద్ద కుప్పకూలిపోయాడు.
ఆందోళన చెందిన శివప్రసాద్ రెడ్డి..
అనంతరం శివప్రసాద్ రెడ్డి తుపాకీ తీసుకుని ఇంట్లోకి వెళ్లి పోయాడు. 20 నిమిషాల పాటు జరిగిన ఘటనపై ఆందోళన చెందాడు. ఈ క్రమంలో తుపాకీతో ఛాతిలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు శివప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి, పార్థసారధి రెడ్డి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు.
ఇంట్లో విభేదాలు.. శివప్రాసాద్ రెడ్డిపై పెరిగిన పగ..!
గత కొంతకాలంగా పార్థసారధి రెడ్డి, అతని భార్య మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అతని భార్య.. గ్రామాన్ని వదిలి బెంగళూరు వెళ్లిపోయారు. కుమారులతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. పార్థసారధి రెడ్డి దంపతుల మధ్య పలుమార్లు పంచాయతీ చేసింది శివప్రసాద్ రెడ్డే. కానీ దంపతులను కలవకుండా శివప్రసాద్ రెడ్డి పంచాయతీ చేశాడని పార్థసారథిరెడ్డి మనసులో కక్ష పెట్టుకున్నాడు. దీంతో మూడేళ్ల నుంచి తరచూ ఇంటి ఎదురుగా ఉన్న శివప్రసాద్ రెడ్డిపైకి దాడికి యత్నించేవాడని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ప్రతి విషయంలో ఎదగనీయకుండా శివప్రసాద్ రెడ్డి అడ్డు పడుతున్నాడని భావించారు. గత ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కూడా వైకాపా తరపున నామినేషన్ వేస్తే... పోలీస్ స్టేషన్లో కేసు ఉందనే కారణంతో పార్థసారధి రెడ్డి నామినేషన్ తిరస్కరించారు. శివప్రసాద్ రెడ్డి భార్య ఎంపీటీసీగా ఏకగ్రీవమయ్యారు. ఇది కూడా పార్థసారథి రెడ్డి మానసికంగా కుంగిపోవడానికి కారణమైంది. మూడు నెలల కిందట పెట్రోలు బాటిల్ తో శివప్రసాద్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. ఈ మధ్య కాలంలో పార్థసారథి ఒంటరిగా ఉండటంతో పాటు మానసికంగా చాలా కుంగిపోయాడని.. ఇందుకోసం వైద్యుల వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కళ్లెదుటే ఈ ఘోరం జరిగిందని బంధువులు అంటున్నారు.
ఆస్తి తగాదాలే కారణం: ఎస్పీ అన్బురాజన్
కాల్పులకు ఆస్తి తగాదాలే కారణమని జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. రెండు కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో వ్యక్తిగత కక్షలున్నట్లు తెలిపారు. ప్రసాద్ రెడ్డి ఇంటిపైకి పార్థసారధి రెడ్డి కత్తి తీసుకొని వచ్చి దాడికి యత్నించారన్నారు. భయంతో ప్రసాద్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీతో పార్థసారధిరెడ్డిపై కాల్పులు జరిపారని వివరించారు. పార్థసారధిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. తర్వాత అదే తుపాకీతో ప్రసాద్‌రెడ్డి కాల్చుకొని చనిపోయాడన్నారు. వారిద్దరి మధ్య వ్యక్తిగత కారణాలూ ఉన్నట్లు విచారణలో తెలిసిందన్నారు. రెండు మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
మరోవైపు వైకాపాకు చెందిన నాయకుడి ఇంట్లో ఇద్దరూ తుపాకీ కాల్పులకు బలి కావడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ముందస్తు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:LIVE VIDEO: డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి