Three dead bodies founded in the river: వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊకచెట్టువాగులో శనివారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. కొత్తకోట నుంచి ఆత్మకూరు వెళ్లే దారిలో ఊకచెట్టువాగు ఉధృతిలో లోలెవల్ వంతెన దాటేందుకు ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పి బైక్ తో సహా ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. జాలర్లు సహా NDRF బృందాలు ముమ్మర గాలింపు చేపట్టి ప్రమాదస్థలికి కిలోమీటరు దూరంలో సంతోష, ఆమె కూతురు పరిమళ మృతదేహాలు మధ్యాహ్నం దొరకగా...సాయంత్రానికి సాయి కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన వారికి దళిత బందుతో పాటు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంతంగా ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. గత నెల 6న గల్లంతై మృతి చెందిన కురుమూర్తి కుటుంబానికి కూడా రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.