సరదాగా ఈతకని వెళ్లిన ఇద్దరు బాలురు విగతజీవులుగా మారారు. అభం శుభం తెలియని పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది.
విషాదం: ఈతకు వెళ్లిన బాలురు.. ఇంటికి తిరిగి రాలేదు..!
వాళ్లకు ఆడుకోవడం మాత్రమే తెలుసు. ఇక్కడ అపాయం ఉంటుందని ఎరుగని పసి మనసులు వారివి. ఎప్పటిలాగే ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు తిరిగి రాలేదు. చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి విగతజీవులుగా మారారు. దీంతో చిన్నారుల కుటుంబాలకు తీరని మనోవేదనను మిగిల్చింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.
గ్రామానికి చెందిన రాంబాబు కుమారుడు సుడిదా అర్జున్(9) రెండో తరగతి చదువుతున్నాడు. సడివేలు కుమారుడు మురి రాజ్ కుమార్(10) ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇద్దరు స్నేహితులు ఎప్పటిలాగే ఆడుకుంటూ పక్కనే ఉన్న ఊరాకుంట చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. మిషన్ కాకతీయ పథకం భాగంగా గతంలో గోతులు తీశారు. అందులో నీరు చేరడంతో గమనించని చిన్నారులు అటువైపుగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పరకాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.