బావిలో పడి అక్కా, తమ్ముడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో జరిగింది. మూట్రాజుపల్లికి చెందిన బేగరి శ్రీనివాస్ భార్య పోచమ్మ ఏడాదిన్నర క్రితం మృతి చెందిన ఘటన మరవకముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్‌కు నిఖిత (12), కార్తిక్ (09) సంతానం.
ఆడుకోవడానికని వెళ్లారు.. విగతజీవులై కనిపించారు - బావిలో పడి అక్కా, తమ్ముడు మృతి
అభంశుభం తెలియని చిన్నారులు అసువులు బాసారు. వారి పాలిట ఓ బావి మృత్యు కుహరమై మింగేసింది. సరదాగా ఆడుకోవాల్సిన అక్కా, తమ్ముడిని కబళించింది.
రోజూలాగే ఆడుకునేందుక వెళ్లి..
తల్లి మృతితో పిల్లలిద్దరు అమ్మమ్మైన భారతమ్మ వద్ద రాజీపేటలో ఉంటున్నారు. వారి బాగోగులు అన్నీ ఆమె చూసేది. రోజూ పిల్లలు సాయంత్రం ఆటలు అడుకునేందుకు వెళ్లేవారు. ఎప్పటిలాగే ఆడుకునేందుకు వెళ్లి ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చి వెతకడం ప్రారంభించారు. గ్రామంలోని బావి సమీపంలో వారి చెప్పులు కనిపించగా.. గ్రామస్థులు అనుమానం వచ్చి బావిలో వెతకారు. బావిలో తేలియాడుతున్న ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు తిరిగిరాని లోకాలకు చేరడంతో వాళ్ల అమ్మమ్మ రోదించిన తీరు అందరిని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు.