ఆటలో తప్పిదం... తీసింది ఇద్దరు చిన్నారుల ప్రాణం - kids died
10:25 April 02
ఇద్దరు చిన్నారులు మృతి
సరదాగా ఆడుకున్న ఆటల్లో ఓ బాలుడు చేసిన తప్పిదం వల్ల ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలురు ప్రశాంత్, విజ్ఞేష్, మరో బాలుడు... నిన్న సాయంత్రం ఇళ్లకు సమీపంలోని ఎండుగడ్డి ఉన్న ప్రాంతంలో ఆడుకున్నారు.
ఆటలో భాగంగా దమ్ము చక్రాల లోపల ప్రశాంత్, విజ్ఞేష్ దాక్కున్నారు. కనిపించకుండా ఉండేందుకు పైన గడ్డి కప్పుకున్నారు. ఈ క్రమంలో మరో బాలుడు గడ్డికి నిప్పుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చక్రాలలో ఇరుక్కున్న బాలురు బయటకు రాలేకపోయారు. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని బయటకు తీశారు. అప్పటికే శరీరంలో ఎక్కువ భాగం కాలిపోగా... హుటాహుటిన మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఏడుగంటలకు ఒకరు, రాత్రి పదిగంటలకు మరొకరు మృతి చెందారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం శవాగారానికి తరలించారు.