తెలంగాణ

telangana

ETV Bharat / crime

Brothers Suicide in Nalgonda: ఆర్థిక ఇబ్బందులతో అన్నదమ్ముల బలవన్మరణం

Brothers Suicide in Nalgonda: స్థిరాస్తి వ్యాపారానికి చేసిన అప్పులు తీర్చలేక సోదరులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే గదిలో చెరో ఫ్యానుకు ఉరేసుకుని ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. ఈ హృదయవిదారక ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Brothers Suicide
Brothers Suicide

By

Published : Apr 12, 2022, 3:45 PM IST

Brothers Suicide in Nalgonda: స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరు అన్నదమ్ములు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే రోజు సోదరులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, టూటౌన్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పెద్దసూరారానికి చెందిన మార్తా శ్రీకాంత్‌(42), మార్తా వెంకన్న(39) కుటుంబాలతో కలిసి నల్గొండలోని శ్రీనగర్‌కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

శ్రీకాంత్‌ ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తూ, సోదరుడు వెంకన్నతో కలసి కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంతోపాటు, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి రూ.3 కోట్లకు పైనా పెట్టుబడి పెట్టారు. కరోనా దెబ్బతో ఆ మొత్తం సకాలంలో తిరిగి రాక, తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగి ఆర్థికంగా నష్టపోయారు. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. సోమవారం కుటుంబ సభ్యులు పెద్దసూరారం వెళ్లడంతో సోదరులిద్దరూ మధ్యాహ్నం ఇంటిలో చెరో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఫోన్‌చేసినా ఎత్తకపోవడంతో రాత్రి 8గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చి తలుపులు తెరవగా ఉరేసుకుని చనిపోయి ఉన్నారు. సంఘటన స్థలానికి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి చేరుకొని విచారణ జరిపారు. ఒకే కుటుంబంలో సోదరులిద్దరూ మరణంలోనూ కలిసే ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి పర్యంతమయ్యారు. వీళ్లిద్దరికీ చెరో కుమార్తె, కుమారుడున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.

చింటూ అమ్మను బాగా చూసుకో...

ఆర్థిక ఇబ్బందులతో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌, వెంకన్నలు సూసైడ్‌ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుసైడ్‌ నోట్‌లో తాను కొంతమందికి డబ్బులు ఇవ్వాలని.. తనకు ఇచ్చేవాళ్లు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు ఆగడంలేదని.. దీంతో పరువు పోయే క్రమంలో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తన కొడుకు చింటూను ఇంట్లో వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని.. ‘మీ అమ్మ నాకు ఎంతో సహాయం చేసింది. అయినా.. మీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నానమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోండి. చెల్లి, అమ్మకు నువ్వే ఇంట్లో పెద్దదిక్కుగా ఉండి వాళ్ల ఆలనాపాలనా చూసుకోవాలి’ అని శ్రీకాంత్‌ సూసైడ్‌నోట్‌లో రాయడం కుటుంబ సభ్యులను, బంధువులను కంటతడి పెట్టించింది. సుసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసినట్లు టూ టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:మహిళ అనుమానాస్పద మృతి.. అత్తింటి వారి వేధింపులే కారణమా..?

ABOUT THE AUTHOR

...view details