తోడబుట్టిన అనుబంధాన్ని మంటగలిపారు. ప్రాణాలతో లేడని కనికరాన్నైనా చూపలేకపోయారు. ఆస్తి ముందు అన్నైనా సరే తక్కువే అనుకున్నారు. చనిపోయిన వ్యక్తిని... పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబాన్ని రోడ్డున వదిలేసి.... మానవత్వాన్ని మరిచిన ఘటన కామారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.
అయ్యప్పనగర్‌కు చెందిన రాజేశానికి ముగ్గురు కుమారులు శ్రీనివాస్, సంజీవ్, కిరణ్. 15ఏళ్ల క్రితం సంజీవ్ ప్రేమవివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో సంజీవ్ తండ్రి తన ఆస్తిని మిగతా ఇద్దరి కుమారులకు ఇచ్చాడు. కానీ సంజీవ్ తానేం తప్పు చేయలేదని.. తన తండ్రి ఆస్తి తనక్కూడా చెందుతుందని.. ఆస్తి విషయంలో పలుమార్లు అన్నదమ్ములను అడగటంతో గొడవలు జరిగాయి.
రెండ్రోజుల క్రితం కామారెడ్డిలో రైలు కింద పడి... సంజీవ్ చనిపోయాడు. సోమవారం రోజున పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. భార్య కల్పన, కుమారులు అద్దె ఇంట్లోకి మృతదేహాన్ని అనుమతించకపోవడం వల్ల సంజీవ్ మృతదేహాన్ని అయ్యప్పనగర్‌లోని సొంతింటికి తీసుకువెళ్లారు. కానీ.. సంజీవ్ అన్నదమ్ములు అతడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు అంగీకరించలేదు. ఏం చేయాలో పాలుపోక మృతుడి భార్య, కుమారులు 6 గంటల పాటు రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి, వేచి చూశారు. అయినా ఫలితం లేకపోవటంతో పోలీసుల జోక్యంతో కుల పెద్దలు సంజీవ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.