ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులోని కీలక పత్రాలు, ఆధారాల చోరీ ఘటనలో పోలీసులు ఆదివారం ఇద్దరిని అరెస్టుచేశారు. అయితే.. దొరికినది నిజమైన దొంగలేనా? పోలీసులపై వస్తున్న ఒత్తిడి, రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు ఎవరో ఒకరిని అరెస్టు చేసి.. వారే దొంగలన్నట్లు చూపిస్తున్నారా? అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణాలివే..
- నెల్లూరులోని నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు భవనం జీ+1గా ఉంటుంది. ఇందులో కింద రెండు కోర్టులు.. పైన ఒక గది ఉంటాయి. దొంగతనం మొదటి అంతస్తులోనే.. అదీ మంత్రి కాకాణి కేసు పత్రాలు, ఆధారాలు ఉన్న బీరువాలోనే జరిగిందని చెబుతున్నారు. ఆ బీరువాలోనే ఎందుకు చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.
- ఇసుము చోరీకే వచ్చారని పోలీసులు చెబుతున్నారు. అలాగైతే కోర్టులోకి తాళం పగలగొట్టి ఎందుకు వెళ్లారు? యాదృచ్ఛికంగా వెళ్లినా.. మిగతా వస్తువులను తాకకుండా ఒక్క బీరువాలోనే దొంగతనం చేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
- వాస్తవానికి గదిలో దొంగతనం చేయాలనుకుంటే.. బీరువా వరకు వెళ్లక్కర్లేదు. తలుపు తీయగానే టేబుళ్లపై కంప్యూటర్లు, పలు కేసులకు సంబంధించిన విలువైన పరికరాలు ఉన్నాయి. వాటిని తాకకపోవడం ఏంటి?
- సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నా.. వారు బహిర్గతం చేసిన చిత్రాల్లో నిందితులను గుర్తించేలా స్పష్టమైన ఆనవాళ్లు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
- ఎవరో సమాచారం ఇచ్చినట్లు బీరువాలో కాకాణి కేసుకు సంబంధించిన సంచినే ఎందుకు తీసుకెళ్లారు? దీనికి కోర్టులోనే ఎవరైనా సహకరించారా? అనే సందేహాలు న్యాయవాద వర్గాల్లో వినిపిస్తున్నాయి.
- దొంగతనం జరిగిన ప్రాంతంలో సాంకేతికపరమైన ఆధారాలు సేకరించినట్లు పోలీసులు చెప్పకపోవడంపై న్యాయవాద వర్గాలు చర్చించుకుంటున్నాయి.
- దొంగలకు ఎవరో ముందే చెప్పినట్లు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసు పత్రాలున్న గదికి వెళ్లి.. ఆ దస్త్రాలే ఎలా తీశారనేది అసలు మిస్టరీగా ఉంది. దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడిస్తే గానీ.. గుట్టు వీడదు.