ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.. అందుబాటులో వైద్యులున్నారు. అయినా ఓ గర్భిణికి పురుడు పోయలేకపోయారు. పురిటి నొప్పులతో సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్ ఆసుపత్రులకు తిరిగినా కవలలను బతికించలేకపోయారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కమల(33)కు ప్రసవ సమయం దగ్గరికి రావడంతో భర్త రామస్వామి ఈ నెల 17న(సోమవారం) కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో అయిదు రోజుల సమయం ఉందని, సిద్దిపేటలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 19న రాత్రి కమలకు పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇక్కడ కరోనా రోగులు ఎక్కువమంది ఉన్నారని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అదే అంబులెన్స్‌లో సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.