తెలంగాణ

telangana

ETV Bharat / crime

Radisson Pub Case: అభిషేక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తింపు - రాడిసన్ బ్లూ పబ్ లైసెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం

TS police investigation into the Radisson Blu Pub case is ongoing
పబ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

By

Published : Apr 5, 2022, 2:05 PM IST

Updated : Apr 5, 2022, 3:18 PM IST

14:02 April 05

పబ్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

Radisson Pub Case: హైదరాబాద్​ బంజారాహిల్స్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే అభిషేక్​తో పబ్ మేనేజర్ అనిల్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇద్దరి చరవాణీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాటిని విశ్లేషిస్తున్నారు. అభిషేక్ చరవాణిలో పలువురు మాదక ద్రవ్యాల విక్రేతల ఫోన్ నెంబర్ల ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అభిషేక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల విక్రేతలకు, అభిషేక్​కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అభిషేక్, అనిల్​ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే, మాదక ద్రవ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు వీరిద్దరి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశముంది.

60 మందికి సరిపడా డ్రగ్స్​..

పబ్ పై దాడి చేసిన సమయంలో అక్కడ ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ల్యాప్​టాప్, సెల్​ఫోన్​ను పోలీసులు సీజ్ చేశారు. పబ్​లోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పబ్​లో 4.6 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. పలు అనుమానాస్పద పదార్థాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. గ్రాము కొకైన్​ను కనీసం 10 నుంచి 12మంది వరకు తీసుకోవచ్చని ఈ లెక్కన దాదాపు 60 మందికి పబ్​లో మాదక ద్రవ్యాలు సరఫరా చేసేలా ఏర్పాట్లు జరిగాయా..? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్​కు వచ్చిన వాళ్లలో అందరూ ఒకరి ఆహ్వానం మేరకే వచ్చారా..? లేకపోతే బృందాలుగా వచ్చారా..? అనే వివరాలను సేకరిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లందరి వివరాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు.. వాళ్లలో ఎవరెవరు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న అర్జున్, కిరణ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పబ్​ లైసెన్స్ రద్దు..

టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డ రాడిసన్‌ బ్లూ హోటల్‌ బార్‌ అండ్‌ రెస్ట్రారెంట్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. పబ్‌లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న ఘటనపై అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పబ్‌ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. బంజారాహిల్స్ పబ్‌ ఘటనపై అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించగా.... నిబంధనలు ఉల్లంఘించినట్లు అబ్కారీ శాఖ నిర్ధరణకు వచ్చింది. పబ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ ఇంఛార్జి డీసీ అజయ్‌రావ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

సంబంధిత కథనాలు..

Last Updated : Apr 5, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details