tension at Aswaraupeta: దశాబ్దాల కాలంగా పోడు సమస్యలకు పరిష్కారం దొరకటం లేదంటూ.. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పరిధిలోని రామన్నగూడెం వాసులు గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే.. ప్రగతి భవన్‌కు పాదయాత్రగా వెళ్లేందుకు పోడు సాగుదారులు నిర్ణయించారు. రంగంలోకి దిగిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, పోలీస్, అటవీ అధికారులతో కలిసి నిన్న రాత్రి చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. అందుకు ససేమిరా అన్న గిరిజనులు.. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో అర్ధరాత్రి రామన్నగూడెంనకు వెళ్లిన పోలీసులు.. గ్రామ సర్పంచ్ స్వరూపతో పాటు పలువురు గిరిజనులను అదుపులోకి తీసుకుని.. అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిద్రలో ఉన్న తమపై పోలీసులు లాఠీఛార్జీ చేశారని గ్రామస్థులు ఆరోపించారు.
మహిళలపై లాఠీఛార్జీ..:అర్ధరాత్రి అరెస్టులతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా పాదయాత్ర చేసి తీరుతామంటూ.. సుమారు 200 మంది వరకు గిరిజనులు గ్రామం నుంచి బయలుదేరారు. పిల్లలు, పెద్దలందరూ కలిసి హైదరాబాద్ కు కాలినడకన బయలుదేరి.. పోడు సమస్య పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు. అశ్వారావుపేట శివారులోని వాగొడ్డిగూడెం వద్ద అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. పాదయాత్రగా వస్తున్న రామన్నగూడెం వాసులను అడ్డుకున్నారు. ఆందోళనకారులు ప్రతిఘటించటంతో ఘర్షణ వాతావణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముల్కలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తాటి వెంకటేశ్వర్లు పరామర్శ..: విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. అక్కడికి చేరుకుని, పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను పరామర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన ఆయన.. హక్కుల కోసం మాట్లాడితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోడు రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని తాటి తెలిపారు.