''స్వశక్తితో ఎదిగి తనకంటూ గుర్తింపు సాధించుకోవాలనుకున్న ఓ మహిళ కల చెదిరిపోయింది. మహిళా పైలట్‌గా రాణించాలన్న ఆమె ఆశను... విధి అడియాశ చేసింది. నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం నేలకూలి తమిళనాడుకు చెందిన మహిమ మృతిచెందింది.''
Nalgonda Plane Crash : నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ దుర్మరణం చెందారు. తమిళనాడుకు చెందిన గజరాజ్ కుమార్తె మహిమ.. నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో పైలట్‌గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా.. శిక్షణ విమానం 'సెస్నా-152' డబుల్ సీటర్‌లో ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పెదవూర మండలం రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. విమానం అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లో కుప్పకూలింది. భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. విమానం ముక్కలు కాగా.. మహిమ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది.
"మహిమ అనే మహిళా పైలట్ మాచర్లలోని ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నుంచి ట్రైనింగ్‌లో భాగంగా ఉదయం 10.30 గంటలకు శిక్షణ విమానంలో హైదరాబాద్ వైపు బయలుదేరింది. నాగార్జునసాగర్ వైపు నుంచి రామన్నగూడెం తండా వద్దకు రాగానే.. గాల్లోనే కంట్రోల్ తప్పి స్పిన్ అయింది. ఉదయం 10.50 గంటల సమయంలో కూలిపోయింది. ఇది సెస్నా 152 అనే ఎయిర్ క్రాఫ్ట్. ఇది టూ సీటర్ ప్లేన్.. దీన్ని ట్రైనింగ్ కోసం వినియోగిస్తారు. ప్రాథమిక విచారణలో మాకు ఈ విషయాలు మాత్రమే తెలిశాయి."
- రెమా రాజేశ్వరి, నల్గొండ జిల్లా ఎస్పీ