Tires Load Truck Theft: హైదరాబాద్ జీడిమెట్లలో టైర్ల లోడ్ లారీని దుండగులు అపహరించుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. నిన్న రాత్రి శంషాబాద్ నుంచి లోడ్‌తో బయలుదేరిన లారీ... వరంగల్‌కు వెళ్లాల్సి ఉంది. డ్రైవర్ రహీం టోలీచౌకిలోని తన ఇంటి వద్ద వాహనాన్ని ఆపి... భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చే వరకు ఇంటి ముందు లారీ కనిపించకపోవటంతో... సమీప ప్రాంతాల్లో వెతికాడు. లారీ ఆచూకీ దొరక్కపోవటంతో రహీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారీలో సుమారు రూ. 20 లక్షల విలువైన టైర్లు ఉన్నాయని వివరించాడు.
అపహరణకు గురైన లారీ లోడ్ నుంచి టైర్లు కింద పడిపోతున్నా... పట్టించుకోకుండా వెళ్తుండటంతో... అనుమానం వచ్చిన వెంబడించిన స్థానికులు జీడిమెట్లలో పట్టుకున్నారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. వాహనంపై ఉన్న యజమాని నంబర్‌కు వారు ఫోన్ చేసి... సమాచారమిచ్చారు. కాగా... అప్పటికే లారీలో నుంచి 5 టైర్లను దుండగులు ఎత్తుకున్నట్లు డ్రైవర్ రహీం తెలిపాడు. వీటి విలువ సుమారు రూ. 70వేలు ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దుండగుల కోసం గాలిస్తున్నారు.