జంటనగరాల్లోని శివార్లలో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న దోపిడీలు, చోరీలు పోలీసులకు సవాలుగా మారాయి. గతనెలలో జీడిమెట్ల వద్ద నగదు బదిలీ దుకాణం యజమానిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు తుపాకీతో బెదిరించి రూ.లక్ష 95 వేలు దోచుకున్నారు. ఆ తర్వాత కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు వద్ద హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో డబ్బులు జమ చేస్తున్నసమయంలో కస్టోడియన్, భద్రతా సిబ్బందిపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపి రూ.5 లక్షలు దోచుకుని పారిపోయారు. ఆ ఘటనలో ఘటనతో కస్టోడియన్ గాయపడగా... సెక్యురిటీ గార్డు మృతి చెందాడు.
ఇవాళ తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో... దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిమైసమ్మ కూడలిలో ఉన్న...ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం గోడకు కన్నం వేసిన దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. లోనికి ప్రవేశించి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగానే...అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.