Honey Trap: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట భార్య మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతున్న అతను తన ఆలనపాలన చూసుకోడానికి ఒక మహిళ తోడు ఉంటే బాగుంటుందనుకున్నారు. పత్రికలో వివాహాల మధ్యవర్తి ఫోన్ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడారు.
అటువైపు నుంచి ముందుగా తన ఖాతాలో రూ. 3 వేలు జమ చేయాలని కోరింది. ఖాతాకు రూ. 3 వేలు జమ చేసిన తర్వాత ఆమె ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ నంబర్‌కు అతను ఫోన్ చేశారు. అలా మాటలు కలిపిన ఆమె అతనితో కలసి జీవించటానికి సుముఖంగా ఉన్నట్లు ఏమార్చింది. కొద్దిరోజులకు తనకు రూ. లక్ష అవసరం ఉందని, నగదు ఇవ్వాలని కోరింది. తన వద్ద డబ్బులు లేవని అతను సున్నితంగా చెప్పాడు. అప్పటి నుంచి అతనితో ఆమె ఫోన్ మాట్లాడటం లేదు.
రెండు రోజుల తర్వాత మరో మహిళ అతనికి ఫోన్ చేసింది. జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానని, తనకు ఎవరూ లేరని చెప్పింది. తనకు చాలా ఆస్తి ఉందని, తాను కూడా తోడు కావాలని కోరుకుంటున్నట్లు నమ్మించింది. కొద్దిరోజుల తర్వాత కుటుంబ అవసరాలకు రూ.లక్ష ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని ప్రేమగా కోరింది. ఆమె మాటలకు ఫిదా అయి రూ.లక్ష ఆమె ఖాతాలో వేశారు. అప్పటి నుంచి ఆమె ఫోన్ తీయడం లేదు. కొద్దిరోజులకు భీమవరం నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది.
వివాహాల మధ్యవర్తి నుంచి నెంబర్ తీసుకున్నానని తెలిపింది. అప్పటికే ఇద్దరు మస్కా కొట్టడంతో కోపంగా ఉన్న వృద్ధుడు ఆమె మాటలు నమ్మశక్యం కాక కొద్దిరోజులు పట్టించుకోలేదు. అయినా ఆమె పదేపదే ఫోన్ చేయడంతో ఒకరోజు మాట్లాడారు. ఇదే తరహాలో తనను మహిళలు మోసగించారని ఆమెకు చెప్పారు. తాను అలాంటి దానిని కాదని, తనకు 35 సంవత్సరాలకే పెళ్లయ్యిందని తెలిపింది. భర్తలో మగతనం లేక, పిల్లలు పుట్టక విడాకులు ఇచ్చానని చెప్పింది.