హైదరాబాద్లో బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది. అధిక డబ్బుల సంపాదన కోసం అక్రమార్కులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను విక్రయిస్తుండగా ముగ్గురిని నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 36 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
నిందితులు ఇంజక్షన్లను ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు. బహిరంగ మార్కెట్లో రూ.8 వేల ధర ఉన్న ఇంజక్షన్లను అక్రమంగా రూ.30 నుంచి 50 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారని సీపీ వెల్లడించారు. అధిక ధరకు ఇంజక్షన్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.