తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gachibowli Accident: రెండు ముక్కలైన కారు.. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న మత్తు, అతివేగం - gachibowli road accident

Gachibowli Accident: ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా కొందరు వాహనదారుల తీరు మారటం లేదు. మద్యం మత్తు, అతివేగంతో వాహనాలు నడుపుతూ తమతో పాటు అమాయకుల ప్రాణాలనూ బలితీసుకుంటున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. చెట్టును ఢీ కొట్టగా కారు రెండు ముక్కలైంది. ఇద్దరు జూనియర్​ ఆర్టిస్టులతో సహా బ్యాంక్‌ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు.

Gachibowli Accident: రెండు ముక్కలైన కారు.. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న మత్తు, అతివేగం
Gachibowli Accident: రెండు ముక్కలైన కారు.. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న మత్తు, అతివేగం

By

Published : Dec 18, 2021, 7:25 PM IST

Updated : Dec 18, 2021, 8:06 PM IST

Gachibowli Accident: రెండు ముక్కలైన కారు.. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న మత్తు, అతివేగం

Gachibowli Accident: అతివేగం అనర్థం.. మద్యం మత్తులో వాహనం నడపడం నేరం.. ఇలా ట్రాఫిక్‌ పోలీసులు ఎన్నో రకాలుగా వాహనదారులను చైతన్యపరచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ మద్యం సేవించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. తమతో పాటు వాహనంలో ఉన్నవారి జీవితాలను ఛిదిమేస్తున్నారు. గచ్చిబౌలి హెచ్​సీయూ మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున కారులో ఉన్న యువకులు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులతో పాటు బ్యాంకు ఉద్యోగి కూడా మృతి చెందారు.

రెండు ముక్కలైన కారు

కారు అతివేగంగా చెట్టును ఢీకొట్టగా వాహనం రెండు ముక్కలైంది. వెనక చక్రాలు ఊడిపోయాయి. కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఎయిర్‌ బ్యాగులు రక్తంతో తడిసిపోయాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బంపర్‌ ఊడిపోయి దూరంగా పడిపోయింది. ప్రమాద తీవ్రతకు చెట్టు కదిలిపోయింది. కారు అతివేగానికి పక్కనే ఉన్న మరో చెట్టు పైభాగాన్ని ఢీకొట్టింది. కారు దెబ్బతిన్న తీరు.. ఘటనాస్థలి పరిసరాలు కారు అతివేగంగా ఉందనేందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

షూటింగ్​ ఉండటంతో..

'గచ్చిబౌలి జేవీ కాలనీలో సాయి సిద్ధు నివాసం ఉంటున్నాడు. సీరియల్స్​లో ఆర్టిస్టుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ఎన్​.మానస,జడ్చర్లకు చెందిన ఎం.మానసలు సిద్ధుకు స్నేహితులు. వీరు కూడా సీరియల్స్​లో ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు అమీర్​పేట హాస్టల్​లో ఉంటున్నారు. సిద్ధుకు ఫ్రెండ్​ అయిన అబ్దుల్ రహీం ప్రైవేట్​ బ్యాంకులో పనిచేస్తూ అమీర్ పేటలోని హాస్టళ్లో ఉంటున్నాడు. సాయి సిద్ధును కలవడానికి అబ్దుల్ రహీం కారు తీసుకుని గచ్చిబౌలికి వచ్చాడు. సీరియల్స్ షూటింగ్ ఉండటంతో మానసలు ఇద్దరు శుక్రవారం రాత్రి సాయి సిద్ధు ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి టీ తాగడానికని నలుగురు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లారు. ఈ క్రమంలో హెచ్​సీయూ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం మలుపు వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. అతివేగంలో ఉండటంతో కారు నడుపుతున్న అబ్దుల్ రహీం మృతి చెందాడు. ముందు సీట్లో కూర్చున్న సాయి సిద్ధుకు గాయాలయ్యాయి. వెనుక కూర్చున్న మానసలిద్దరు కారు డోర్లు తెరచుకొని బయటపడి చనిపోయారు.' -సురేశ్​, గచ్చిబౌలి సీఐ

అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో ఉంటున్న ఎన్.మాసన, ఎం.మానసతో పాటు విజయవాడకు చెందిన అబ్దుల్ రహీమ్ మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మాదాపూర్‌ యాక్సిస్ బ్యాంకులో అబ్దుల్ రహీమ్ పనిచేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎం.మానస స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు.మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధుకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

కాళ్లకు దండం పెట్టీ మరి..

షూటింగ్ ఉందని చెప్పడంతో చెల్లి హైదరాబాద్​కు వచ్చింది. ఎన్​.మానసతో కలిసి నిన్న ఈవెనింగ్​ చెల్లి వీడియో కాల్​ కూడా మాట్లాడింది. ఎప్పుడూ లేనిది హైదరాబాద్​ వచ్చే ముందు నా కాళ్లకు దండం పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పింది.' -వైష్ణవి, ఎం.మానస అక్క

మత్తులోనే డ్రైవింగ్​..

ఉదయం షూటింగ్ ఉందని గచ్చిబౌలిలోని జేవీ హిల్స్​లో సిద్ధూ ఇంటికి రాత్రి వచ్చిన ముగ్గురు మద్యం తాగారు. తర్వాత టీ తాగడానికి నలుగురు లింగంపల్లి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొట్టిందని.. కారు అతివేగంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

Gachibowli Road Accident Today : గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Last Updated : Dec 18, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details