Two wheelers theft: హైదరాబాద్‌లో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 53 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని బడంగ్‌పేట్‌కు చెందిన మాచర్ల శ్రీకాంత్ మోహన్, షాద్‌నగర్‌లో సమీపంలోని కేశంపేట్, చౌలపల్లి గ్రామాలకు చెందిన గణేశ్, సత్తు శ్రీశైలంను అరెస్ట్ చేశారు.
ముగ్గురు స్నేహితులైన నిందితులు.. విలాసాలకు అలవాటుపడి రెండేళ్లుగా ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేసిన వాహనాలు అని చెప్పి గ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య వెల్లడించారు.
ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనం దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు మాచర్ల శ్రీకాంత్ మోహన్‌ను అదుపులోకి తీసుకోవటంతో.. రెండేళ్లుగా సాగుతున్న దందా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో శ్రీకాంత్ మిగిలిన ఇద్దరు నిందితుల పేర్లు చెప్పడంతో వాళ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.