తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం : త్వరగా వచ్చేస్తాం నాన్నా అని.. అమ్మ దగ్గరికి వెళ్లిపోయారు - ap news

"నాన్నా.. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లు.. మే ముగ్గురం మిగిలిన పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాం" అంటూ.. పిల్లలు చెప్పిన ఆ మాటలే... చివరి మాటలవుతాయని అనుకోలేదంటూ ఆ తండ్రి బోరున విలపిస్తున్నాడు. భార్య మృతి గుండెలు పిండేస్తుంటే.. బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదని ఎదురుచూస్తుండగా.. గోదావరిలో మునిగి చనిపోయింది తన పిల్లలేనని తెలిసీ హతాశుడయ్యారు. మూడురోజుల పాటు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే మృతదేహాలు ఉండగా.. ఎవరూ గుర్తించలేదని పోలీసులే ఖననం చేశారు. అయ్యో ఆఖరి చూపూ దక్కలేదే.. అంటూ ఆయన రోదిస్తుంటే.. చూసినవారి కళ్లు చెమర్చాయి.

suicide, suicide in ap, children suicide in ap
ఏపీ వార్తలు, ఏపీలో ముగ్గురు పిల్లల ఆత్మహత్య, ఏపీ క్రైమ్ న్యూస్

By

Published : Jun 8, 2021, 1:08 PM IST

ఏపీలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇసుకరేవు వద్ద గోదావరిలో తేలిన ముగ్గురి మృతదేహాల ఘటనకు సంబంధించి.. అత్యంత విషాదకరమైన వాస్తవం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని బాపూజీనగర్‌ ప్రాంతానికి చెందిన మామిడిపల్లి నరసింహం రైల్వే గ్యాంగ్‌మన్‌గా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య మాణిక్యం(58)తో పాటు ఇద్దరు కుమార్తెలు కన్నాదేవి (34), నాగమణి(32), కుమారుడు దుర్గారావు(30) ఉన్నారు. ముగ్గురు బిడ్డలూ ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతిలోనే చదువు మానేశారు. కుమార్తెలు ఇంటి వద్దనే ఉంటుండగా, కొడుకు రాజమహేంద్రవరంలోని ఓ మొబైల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు.

కుమార్తె మాట కాదనలేక...

తన పెళ్లి కన్నా.. ముందు సొంతిల్లు కట్టుకుందామన్న పెద్దకూతురు కన్నాదేవి నిర్ణయాన్ని కుటుంబసభ్యులు కాదనలేకపోయారు. గతేడాది స్వస్థలంలో చిన్నపాటి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అంతలోనే ఇంటావిడ మాణిక్యానికి ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆమెను గత నెల 27న రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. 29న ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 31న మధ్యాహ్నం మాణిక్యం మృతిచెందారు. ఆ రోజు సాయంత్రం ఇన్నీసుపేట కైలాసభూమిలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఆ తర్వాతే అసలు కథ...

ఏడు గంటల సమయంలో తండ్రి మాణిక్యం, మేనమామ నాగేశ్వరరావుతో... "మీరు ఇంటికి వెళ్లండి.. మేము పనులు చూసుకుని వస్తాం" అని ముగ్గురు పిల్లలు చెప్పగా.. వారు వెళ్లిపోయారు. అనంతరం కన్నాదేవి, నాగమణి, దుర్గారావు నడుచుకుంటూ ఇసుకరేవు వద్దకు వెళ్లారు. కాసేపటికే.. ముగ్గురూ గోదావరిలో మృతదేహాలుగా తేలారు. అయితే.. ఎవరో ముగ్గురు అక్కడ కూర్చుని ఏడ్చారంటూ విచారణ సమయంలో అక్కడి జాలర్లు చెప్పారని పోలీసులు చెప్పారు. తల్లి మరణంతో మనస్తాపానికి గురైన బిడ్డలు ముగ్గురూ.. నదిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. కేసు మరింతగా దర్యాప్తు చేస్తున్నామని, వాస్తవాలు త్వరలోనే తేలుస్తామని ఎస్సై నవీన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details