Three children died after falling into a puddle: ఆట సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను ముంచేసింది. వెంచర్లలో తీసిన గోతులు ఆడుకుంటున్న పిల్లలను బలిగొన్నాయి. 3 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఆడుకునేందుకు ఇంట్లో నుంచి వెళ్లిన తమ బిడ్డలు విగతజీవుల్లా మారటాన్ని చూసి.. వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు.
విషాదం.. నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి.. - తాజా నేర వార్తలు
11:01 September 26
విషాదం.. నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి..
బతుకమ్మ వేడుకలు, దసరా సెలవుల వేళ షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పాఠశాలలకు పండుగ సెలవులు రావటంతో ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. సోలీపూర్‌కు చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫారిన్ అనే పిల్లలతో పాటు మరో బాబు గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో ఆడుకునేందుకు వెళ్లారు. ఇటీవల మట్టి కోసం వెంచర్‌లో గోతులు తీయగా.. భారీ వర్షాలు పడి అవి పూర్తిగా నిండిపోయాయి. వెంచర్‌లో ఆడుకునే క్రమంలో ఈ గోతుల వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. నలుగురిలో ఒక బాబు అతి కష్టం మీద బయటికి రాగా.. అక్షిత్, ఫరీద్, ఫారిన్‌లు నీటిలో మునిగిపోయారు.
ప్రాణాలతో బయటపడిన బాబు ఊళ్లోకి చేరుకుని గ్రామస్థులకు విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న గ్రామప్రజలు, చిన్నారుల కుటుంబసభ్యులు వెంచర్ వద్దకు పరుగులు తీశారు. గోతిలోకి దిగి వెతకగా ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో నుంచి ఆడుకునేందుకు బయటికి వెళ్లిన తమ బిడ్డలను విగతజీవులుగా చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. పిల్లల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారితో కన్నీరు పెట్టించింది. ఘటనా స్థలికి చేరుకున్న షాద్‌నగర్ పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. పిల్లల మృతదేహాలను అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: