కుంట శ్రీనుకు వామన్‌రావుతో గ్రామంలోని పలు అంశాల్లో విభేదాలున్నాయనేది స్థానికంగా అందరికీ తెలిసిందే. ఆ కారణంతోనే అతడు వామన్‌రావు దంపతుల హత్యలకు పాల్పడి ఉంటాడని మొదట భావించారు. పోలీసులూ అదే మాట చెప్పారు. అయితే కుంట శ్రీనును విచారించాక బిట్టు శ్రీను పాత్ర బహిర్గతమైంది. హత్య సమయంలో వినియోగించిన కారుతోపాటు కత్తుల్ని సమకూర్చింది ‘'బిట్టు’' అని తేలడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
సీసీ ఫుటేజీ మలుపు:
మొదట అతడు వ్యక్తిగత కక్షలతోనే దారుణానికి తెగబడ్డానని చెప్పినట్లు సమాచారం. సరిగ్గా ఇక్కడే పోలీసుల చేతికొక బలమైన అస్త్రం దొరికింది. మంథని పట్టణంలోని ఓ కూడలిలో లభించిన సీసీ కెమెరా ఫుటేజీలో కీలక ఆధారం లభించింది. బిట్టు శ్రీను నిందితుడు కుంట శ్రీనుకు నేరుగా ఆయుధాల్ని అందించిన విషయం ఆ కెమెరాల్లో రికార్డయినట్లు సమాచారం. దాన్ని చూపించడంతో అతడు బిట్టు శ్రీను పాత్ర గురించి ఒప్పుకోక తప్పలేదని తెలిసింది.
ఎవరైనా పురమాయించారా..?
వాస్తవానికి వామనరావుతో కుంట శ్రీనుకు వ్యక్తిగతంగా శత్రుత్వం ఉందే తప్ప బిట్టు శ్రీనుతో లేదనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అలాంటప్పుడు వామనరావును చంపించేంత అవసరం అతడికి ఎందుకొచ్చిందనేది ప్రస్తుతం నిగ్గు తేలాల్సిన అంశం. ఆ కారణాన్ని పోలీసులు కచ్చితంగా విశ్లేషించగలిగితే కేసు ఓ కొలిక్కి వస్తుంది. లేదంటే వామనరావును అంతమొందించడానికి మరెవరో బిట్టు శ్రీనును పురమాయించారనే వాదనకు బలం చేకూరినట్లవుతుంది.