Hyderabad Chain Snatching Case Update : ఈ నెల 7న హైదరాబాద్‌లో వరుసగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు నగరం వీడి దిల్లీలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. వరుస దొంగతనాల అనంతరం హైదరాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా దిల్లీ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలో నిఘా పెట్టిన నగర పోలీసులు.. అక్కడి పోలీసుల సహాయంతో వారి ఉనికి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి పాత నేరస్థుల సాయం కూడా తీసుకుంటున్నారు.
ఇదీ జరిగింది..: ఈ నెల 7న ఉదయం వరుస గొలుసు దొంగతనాలతో గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేశారు. దాదాపు రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం 6:20 గంటల నుంచి 8:10 గంటల వరకు వివిధ చోట్ల హడలెత్తించారు. ఉప్పల్ పరిధిలోని రాజధాని ప్రాంతంతో పాటు కల్యాణపురి, నాచారంలోని నాగేంద్రనగర్, హబ్సిగూడాలోని రవీంద్రనగర్, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఆగంతకులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
బైక్‌ను దొంగిలించి చైన్ స్నాచింగ్ అనంతరం వదిలిపెట్టి: ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన ద్విచక్రవాహనంపై వచ్చి ఉప్పల్ చౌరాస్తాకు సమీపంలో తొలుత ఓ గొలుసు తెంచుకెళ్లిన ఇద్దరు దుండగులు.. కల్యాణిపురి కాలనీలో ఓ వృద్ధురాలి బంగారు నగలను అపహరించుకుపోయారు. హబ్సిగూడ రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు పూలు తెంపుతుండగా.. పల్సర్ బైక్‌పై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ అదును చూసి గొలుసు తెంచుకుని ఉడాయించారు.
నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగేంద్రనగర్‌లో ఇంటి ముందు విమల అనే వృద్ధురాలు ముగ్గు వేస్తుండగా.. పువ్వులు కావాలంటూ దగ్గరకు వచ్చి ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. చోరీలు చేసిన తర్వాత గొలుసు దొంగలు ద్విచక్ర వాహనాన్ని ప్యారడైజ్ వద్ద వదిలివెళ్లారు.