హోటల్‌లోకి దొంగలు చొరబడి భార్యా భర్తలపై దాడి చేసి సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో జరిగింది. గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ కొంత కాలంగా భార్యతో కలిసి హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని నలుగురు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. లక్ష్మణ్ భార్య చెవిని కత్తిరించి బంగారాన్ని తీసుకున్నారు. అడ్డు వచ్చిన భర్తపై దాడి చేసి గాయపరిచారు. అతని చేయి వేలుకు గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.
భార్యాభర్తలపై దాడి.. బంగారం అపహరణ - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి భార్యాభర్తలపై దాడి చేశారు. సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగతనం విషయమై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్థులంతా కలిసి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు తెలిపారు. ఫలితంగా దొంగతనాలను అరికట్టే వీలుంటుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరైనా అపరిచితులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇదీ చదవండి: అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్