Theft in Kaleshwaram Project: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌లో విద్యుత్ సామగ్రిని చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 220 కేవీ అదనపు విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి సంబంధించిన టవర్లు, ఇతర సామగ్రిని ఇటీవల కొందరు యువకులు అపహరించినట్లు సమాచారం. నిర్మాణ పనులకు సంబంధించిన గుత్తేదారు దీనిపై పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
దీనిపై పోలీసులు విచారణ చేపట్టి కొందరు యువకులను గుర్తించి మందలించినట్లు తెలిసింది. చోరీ చేసిన సామగ్రి విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుంది. చోరీకి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్ పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన వారిని విచారిస్తున్నామన్నారు.