Theft in 16 Houses at Kukatpally: భాగ్యనగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా పక్కపక్క కాలనీలోని ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీకి తెగబడ్డారు. ఒకే రోజు రాత్రి మూడు కాలనీలలోని 16 ఇళ్లను దోచుకుని.. అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. నగరంలోని దయార్‌గూడ, కేరళ బస్తీ, దేవి నగర్‌లో చోరీకి తెగబడ్డ దొంగలు.. అందినకాడికి దోచుకెళ్లారు.
దేవి నగర్, కేరళ బస్తీల్లో 8 ఇళ్లు, దయార్‌గూడలో సుమారు 8 ఇళ్లలో చోరీలు చేశారు. తాళాలు పగలగొట్టి.. వస్తువులన్ని చిందరవందరగా పడేశారు. దొరికిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు. పొద్దున్నే లేచి ఇళ్లను చూసుకున్న బాధితులు.. ఒక్కసారిగా షాకయ్యారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. కేసులు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. ఘటనాస్థలాలకు వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్స్ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. వీధుల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు.. కొందరు దుండగులు వీధుల్లో సంచరిస్తోన్న దృశ్యాలు లభ్యమయ్యాయి. అయితే.. ఈ వరుస దొంగతనాలన్ని ఎవరికీ వారు ఒంటరిగా చేశారా ? లేదా ఏదైనా అంతర్రాష్ట్ర గ్యాంగ్ చేసిందా ? ఏకకాలంలో విడివిడిగా దొంగతనానికి పాల్పడ్డారా..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా తెలివిగా దొంగలు సీసీ కెమెరాలు ఉన్నచోట పరిశీలిస్తూ కాలనీలో తిరుగుతూ.. కొన్నిచోట్ల సీసీ కెమెరాలకు చిక్కారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో చూస్తే అర్థమవుతుంది. ఓ ఇంట్లో హుండీలో దాచుకున్న 10 వేల రూపాయలు ఎత్తుకెళ్లగా, మరో ఇంట్లో వెండి పట్టగొలుసులు, ఇంకొక ఇంట్లో ల్యాప్‌టాప్ లాంటి వివిధ వస్తువులు దోచుకెళ్లారు.
కొందరు యజమానులు తమ ఇళ్లలో నగదు, బంగారం పోయిందని ఫిర్యాదు చేసినప్పటికీ.. చోరీకి గురైన అన్ని ఇళ్ల యజమానులు వస్తే గాని పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చోరీలు జరిగిన అన్ని ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారు. పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు ఇంటి యజమానులు లేకపోవడంతో చోరీ సొత్తుపై నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రాత్రి 16 ఇళ్లలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు ఇవీ చదవండి: