తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుక్కకు చికెన్‌ ముక్క వేసి.. రూ.20 లక్షలు ఎత్తుకెళ్లారు.. ఎక్కడంటే..?

Theft in Guntur Chilli Company : పక్కాగా రెక్కీ నిర్వహించారు. అదను చూసి దొంగతనానికి వచ్చారు. గేటు వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీని బెదిరించి తమ పని కానిచ్చేశారు. అంతా అయిపోయాక బయటకు వస్తుంటే అప్పటి వరకు పడుకుని ఉన్న కుక్క ఒక్కసారిగా లేచి అరవడం మొదలెట్టింది. ఈ హఠాత్పరిణామంతో ఆ దొంగల గుండె ఝళ్లుమంది. ఇప్పుడెలారా బాబు అనుకుంటుండగా.. వారికి వచ్చిన ఒక్క ఐడియాతో కుక్కకు మస్కా కొట్టి అక్కడి నుంచి జంప్‌ అయ్యారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

By

Published : Dec 18, 2022, 1:29 PM IST

కుక్కకు చికెన్‌ ముక్కలు వేసి భారీ చోరీ.. ఎక్కడంటే..?
కుక్కకు చికెన్‌ ముక్కలు వేసి భారీ చోరీ.. ఎక్కడంటే..?

Theft in Guntur Chilli Company : ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ చోరీ జరిగింది. దుండగులు రూ.20 లక్షలకు పైగా ఎత్తుకెళ్లారు. అయితే దొంగతనం చేస్తున్న సమయంలో ఘటనా స్థలంలోని కాపలా కుక్క అరవకుండా.. వారితో పాటు తెచ్చుకున్న చికెన్​ ముక్కలను వేశారు. చోరీ అనంతరం ద్విచక్రవాహనంపై పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటప్పయ్య కాలనీ లాల్‌పురంరోడ్డు చివర చోరీ జరిగిన మిర్చి ఎగుమతుల కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాతో పాటు ఇతర ప్రాంతాలకు భారీ మొత్తంలో మిర్చి ఎగుమతి చేస్తుంటారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మిర్చి ఎగుమతి కంపెనీ వద్దకు వచ్చారు. వారు వచ్చిన వాహన శబ్ధం విన్న కంపెనీ వాచ్​మెన్​ ఎవరని అరిచాడు. దీంతో వాచ్​మెన్​ను పట్టుకుని.. చేతులను తాళ్లతో కట్టేశారు. అరిస్తే చంపుతామని బ్లేడ్​ చూపించి అతనిని బెదిరించారు.

చోరీ అనంతరం..

ఒక వ్యక్తి వాచ్​మెన్​ దగ్గర ఉండగా.. మరో వ్యక్తి కంపెనీ ద్వారానికి ఉన్న తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లాడు. కంపెనీ గదిలో ఉన్న కప్​బోర్డు తాళాన్ని తీసి అందులోని నగదును అపహరించాడు. అయితే దుండగులు బయటకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కుక్క అరిచింది. దాని అరుపులు ఆపేందుకు వారు తమ వద్ద ఉన్న చికెన్​ ముక్కలను వేసి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పారిపోయారు.

రూ.20 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లారని కంపెనీ యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నగరపాలెం సీఐ హైమరావు తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్​ టీం, నేర విభాగ పోలీసులు అధారాలు సేకరించారని వివరించారు. అదే కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది ఈ చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details