తెలంగాణ

telangana

ETV Bharat / crime

'ప్రకటనలు వేసి సినిమాను ఆలస్యంగా ప్రారంభించినందుకు రూ.లక్ష జరిమానా' - ఐనాక్స్ లీజర్ థియేటర్

RS.1 Lack Fine For Theatre: సమయానికి సినిమా వేయనందుకు ఓ థియేటర్​కు రూ. లక్షకు పైగా జరిమానా విధించిన ఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది. టికెట్​పై ముద్రించిన సమయానికి సినిమాను ప్రారంభించకుండా.. 15 నిమిషాలు ప్రకటనలు వేసి.. తన సమయాన్ని వృథా చేశారని ఓ వ్యక్తి జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు.

Fine For Theatre
థియేటర్​కు జరిమానా

By

Published : Dec 18, 2021, 6:38 AM IST

RS.1 Lack Fine For Theatre: సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుడి విలువైన సమయాన్ని వృథాచేసిన ఐనాక్స్‌ లీజర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ రూ.10 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు పెనాల్టీ కింద లక్ష రూపాయలు అందించాలని పేర్కొంది.

మాకు ప్రకటనలు వేసే హక్కు ఉంది..

తార్నాకకు చెందిన విజయ్‌గోపాల్‌ 2019 జూన్‌ 22న ‘గేమ్‌ ఓవర్‌’ అనే సినిమా చూడడానికి కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని ఐనాక్స్‌ థియేటర్‌కు వెళ్లారు. టిక్కెట్‌పై ముద్రించిన సమయం ప్రకారం సినిమా మొదలవ్వాల్సింది సాయంత్రం 4.30 గం.లకు కాగా 4.45కు మొదలైంది. సుమారు 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ విజయ్‌గోపాల్‌ థియేటర్‌ మేనేజర్‌కు ఫిర్యాదుచేశారు. స్పందన లేకపోవడంతో హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్‌ అథారిటీ ‘హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌’ను చేర్చారు. తెలంగాణ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం-1955 ప్రకారం పాత పద్ధతిని అనుసరిస్తూనే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్‌ యాజమాన్యం సమర్థించుకుంది. ఆర్టికల్‌ 19(1)(జి), (ఎ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు తమకు ఉందని పేర్కొంది.

రూ.లక్ష జరిమానా

కేసును హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 అధ్యక్షురాలు పి.కస్తూరి, సభ్యులు రామ్మోహన్‌, పారుపల్లి జవహర్‌బాబుతో కూడిన బెంచ్‌ విచారించింది. ప్రతివాద ఐనాక్స్‌ సంస్థ వ్యాఖ్యలను తప్పుపట్టింది. తెలంగాణ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం-1970, రూల్‌నెం.41 ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని పేర్కొంది. వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించింది. థియేటర్ల యాజమాన్యాలు టిక్కెట్‌పై సినిమా మొదలుపెట్టే కచ్చితమైన సమయం ముద్రించాలని తెలిపింది. ఫిర్యాదీకి పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని ఐనాక్స్‌ లీజర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఆదేశించింది. లైసెన్సింగ్‌ అథారిటీ అయిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కి పెనాల్టీ కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి జిల్లా కమిషన్‌ కమిషన్‌ బెంచ్‌ సూచించింది.

ఇదీ చూడండి:IAMC Inauguration:హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక కేంద్రం.. ప్రారంభించనున్న సీజేఐ

ABOUT THE AUTHOR

...view details