కడదాకా కలిసుండాల్సిన భార్యే.. భర్త స్నేహితుడితో కలిసి దారుణానికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తినే హతమార్చింది. గత నెల 31న మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధిలోని గద్దెరాగడిలో జరిగిన పల్లికొండ సంతోష్ అనే కూరగాయల వ్యాపారి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు.
మందమర్రి సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన సంతోష్ అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోష్ స్నేహితుడైన గుర్రం లక్ష్మణ్ తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో సంతోష్ భార్యతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సంతోష్ అడ్డు తొలగించుకోవడానికి లక్ష్మి, లక్ష్మణ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.