నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో గతంలో బీమా డబ్బుల పేరిట వ్యక్తులను హతమార్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విషయం బయటకు రాకుండ చాకచక్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బీమా ఏజెంట్లకు, లబ్ధిదారులకు మధ్య వివాదం తలెత్తడం వల్ల.. కొంత మంది రాజకీయ నాయకులు మధ్య మార్గంగా పరిస్థితిని చక్కదిద్దిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న తరుణంలో.. అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. దామరచర్ల మండలంలో గతంలో జరిగిన మాదిరిగానే తాజాగా దేవిరెడ్డి కోటి రెడ్డి మృతి జరిగిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొండ్రపోలుకు చెందిన దేవిరెడ్డి కోటి రెడ్డి దామరచర్లలో ఉన్న.. ఓ వైన్ షాప్‌కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లో వర్కర్‌గా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పని పూర్తి చేసుకుని ఆయన ఇంటికి బయలుదేరాడు. కానీ బొత్తలపాలెం సమీపంలోని నార్కెట్ పల్లి-అద్దంకి హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.