ద్విచక్రవాహనంపై వేగంగా వెళుతోన్న ముగ్గురు యువకులు తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై మధుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాములవారి గూడెం గ్రామానికి చెందిన భాను కిరణ్ తన ఇద్దరు మిత్రులతో కలిసి వినాయకపురంలో మద్యం సేవించి స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో ఊట్లపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా నడిపారు. ఆ క్రమంలో ఎదురుగా ఉన్న ఎస్సై మధుప్రసాద్ ఢీకొట్టారు.