కొవిడ్ రెండో ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నగరంతోపాటు శివారుల్లో ఉండే ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు మూతపడ్డాయి. వాటిలో పనిచేసే ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లారు. లాక్‌డౌన్ తర్వాత తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ లోపు నగర శివారుల్లోని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుసగా చోరీలకు పాల్పడుతున్నాయి. పోలీసుల నిఘా కొరవడడం వల్ల చోరుల పని సులువు అవుతోంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, చోరీ జరిగిన తర్వాత కేసును ఛేదించేందుకు ఉపయోగపడుతాయే తప్ప, చోరీలను నియంత్రించే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు.
*నగర శివారులోని దుండిగల్‌లో సోమవారం రాత్రి వరుసగా ఆరు ఇళ్లలో చోరీలు జరిగాయి. మొత్తం అయిదుగురు దొంగల ముఠా నగర శివారులోని ఇళ్లు లక్ష్యంగా చోరీలకు తెగబడింది. ఇందులో రెండు ఇళ్లకు ఉన్న తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. ఆధారాలు లభించకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
* జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం రాత్రి బందిపోటు దొంగలు ఒక్కసారిగా పంజా విసిరారు. రెండు వీధుల్లో ఒకదాని తర్వాత మరొక ఇంట్లో ఇలా ఐదు ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. రూ.30 లక్షల నగదు, 54 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి ఎత్తుకెళ్లారు. తమను ఎవరూ పట్టుకోకుండా అటూ, ఇటూ ఉన్న ఇళ్లకు ముందు గడియ వేశారు.