వ్యవసాయ రుణం డబ్బు విషయంలో ఓ వ్యక్తి తన కన్న తండ్రినే అతిదారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామ శివారులో జరిగింది.
కామారెడ్డి జిల్లా పరిధిలోని క్యాసంపల్లి గ్రామానికి చెందిన ఫకీరా తనకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి కుమారుడు భాస్కర్, కమార్తె కవిత ఉన్నారు. భాస్కర్ వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ తన భార్యా, పిల్లలతో కలిసి తండ్రితోనే ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఫకీరా ఓ బ్యాంకు నుంచి పంటరుణం తీసుకున్నాడు.
ఆ డబ్బు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బ్యాంక్ రుణం చెల్లించడానికి అని చెప్పి భాస్కర్ తన తండ్రిని బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో ఉగ్రవాయి గ్రామ శివారులోకి చేరుకోగానే ఫకీరాను కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఇంటికొచ్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఈ విషయమై భాస్కర్‌ను ప్రశ్నించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్