తెలంగాణ

telangana

ETV Bharat / crime

కాల్పుల ఘటనలో వీడని చిక్కుముడి.. వివాదాస్పద భూముల సెటిల్‌మెంట్‌లో శ్రీనివాస్‌రెడ్డి పాత్ర? - Telangana Realtors Murder Case

Telangana Realtors Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కర్ణంగూడ కాల్పుల ఘటనలో ఇంకా చిక్కుముడి వీడలేదు. ఈ కాల్పుల్లో స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిలు మృత్యువాతపడ్డారు. కాల్పుల్లో ఇద్దరూ మృతి చెందడంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. మృతుడు శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన డ్రైవర్‌ కృష్ణ,సూపర్‌వైజర్‌ హఫీజ్‌తోపాటు పక్క పొలానికి చెందిన మట్టారెడ్డి, పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

gun firings on realtors
స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు

By

Published : Mar 2, 2022, 2:00 PM IST

Telangana Realtors Murder Case: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ కాల్పుల ఘటనలో పోలీసుల దర్యాప్తు కష్టతరంగా మారింది. మంగళవారం ఉదయం ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలోనే స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్​ రెడ్డి చనిపోగా.... చికిత్స పొందుతూ రాఘవేందర్​ రెడ్డి మృతిచెందారు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేందర్ రెడ్డి.. అంతలోనే పరిస్థితి విషమించటంతో ప్రాణాలు విడిచారు. కాల్పుల గురించి తెలుసుకునే లోపే ఆయన చనిపోవటంతో కేసు విచారణ పోలీసులకు సవాల్​గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాలపైనే దృష్టి సారించిన పోలీసులు... మృతుల కాల్​డేటా, సెల్​ఫోన్​ సిగ్నళ్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు.

వివాదాస్పద భూముల సెటిల్మెంట్​లోను చేయి

శ్రీనివాస్​ రెడ్డి డ్రైవర్​ కృష్ణ, హఫీజ్​ల పేరు మీద పలు ఆస్తులను.. ఆయన రిజిస్ట్రేషన్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ శ్రీనివాస్ రెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. కృష్ణ, హఫీజ్​లతో పాటు పక్క పొలానికి చెందిన మట్టారెడ్డి, ఇతర అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా... కాల్పులకు శ్రీనివాస్​ రెడ్డి వివాదాస్పద భూమి కారణం కాదని భావిస్తున్నారు. పలు వివాదాస్పద భూములను ఇప్పటికే ఆయన సెటిల్​మెంట్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా ఆయన జోక్యం చేసుకున్న భూవ్యవహారాల గురించి ఆరాతీస్తున్నారు.

రెక్కీ నిర్వహించి

కాల్పులకు పాల్పడింది ప్రొఫెషనల్‌ షూటర్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుపారీ గ్యాంగ్​తో హత్య చేయించి ఉండొచ్చనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. అప్పటికే శ్రీనివాస్​ రెడ్డి, రాఘవేందర్రెడ్డిని మట్టుబెట్టేందుకు రెక్కీ నిర్వహించి కర్ణంగూడ ప్రాంతాన్ని అనువైన స్థలంగా దుండగులు ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఎస్‌వోటీ, ఐటీ సెల్‌, సీసీఎస్‌, ఎస్బీ, ఇంటెలిజెన్స్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:రెండు ప్రాణాల్ని బలి తీసుకున్న భూవివాదం.. సినీ ఫక్కీలో కాల్పులు

ABOUT THE AUTHOR

...view details