Police Foil Terror Attack in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం సృష్టిచాయి. ఎట్టకేలకు పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌లో ఉండి హైదరాబాద్‌లో పలు పేలుళ్లతో సంబంధమున్న ఫర్హతుల్లా గోరి, అబ్దుల్ మాజిద్, అబు అంజాలాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో జాహెద్‌పై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. గతంలో బేగంపేట, గణపతి దేవాలయం కేసుల్లో జాహెద్‌ను పోలీసులు విచారించారు.
తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి జరిపిన సోదాల్లో జాహెద్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ జాహెద్‌తో చర్చలు జరిపిన ఉగ్రవాదులు అతనికి ఆర్ధిక సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడులు చేసేందుకు యువతను రిక్రూట్ చేసుకోమని జాహెద్‌కు చెప్పగా.. సైదాబాద్‌కు చెందిన సమీయుద్దీన్, మెహదీపట్నంకు చెందిన మాజ్‌హసన్ ఫారుకిలను జాహెద్ రిక్రూట్ చేసుకున్నాడు.
వీరితో కలిసి జాహెద్ జన సమూహాలపై ఒక్కొక్కరిగా వెళ్లి గ్రనేడ్లు విసరడం, బహిరంగ సభలపై గ్రనేడ్లు విసిరేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి దాడులకు శిక్షణ పొందినట్లు గుర్తించారు. దాడులు కోసం పాకిస్థాన్ ఉగ్రవాద హ్యాండ్లర్ల నుంచి గ్రనేడ్లను సేకరించినట్లు గుర్తించిన పోలీసులు.. ఏ విధంగా చేరారన్నదానిపై దృష్టి సారించారు.
గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యం:గుంపులుగా ఉన్న ప్రజల్లోకి గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో జాహెద్ వెల్లడించాడు. తరచూ జాహెద్‌ను మరో ఇద్దరు నిందితులు కలిసినట్లు ఆధారాలు సేరిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు, కాల్ డేటా, సామాజిక మాధ్యమాలు పరిశీలిస్తున్నారు. వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.