తెలంగాణ

telangana

ETV Bharat / crime

'సైబర్‌' వలేస్తే.. ఖాతాదారు కత్తిరిస్తే..

సైబర్‌ దొంగలు రెప్పపాటు సమయంలో ప్రజల బ్యాంకు ఖాతాల్ని ఖాళీ చేస్తుంటారు. అయితే ఈ రెండు ఘటనల్లో మాత్రం ఆ మోసగాళ్ల ఆశల మీద నీరు జల్లినట్లైంది.

cyber
‘సైబర్‌’ వలేస్తే.. ఖాతాదారు కత్తిరిస్తే..

By

Published : Apr 6, 2021, 9:30 AM IST

హైదరాబాద్​ పాతబస్తీకి చెందిన ఓ వయోధికురాలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ‘మేడం.. మీ ఖాతాలోంచి రూ.5 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. ఆ డబ్బును మీ ఖాతాకు బదిలీ చేయాలంటే.. వెంటనే మీ చరవాణికి వచ్చిన కోడ్‌ నెంబర్లు చెప్పండి’ అని చెప్పడంతో ఆ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పారు. ఇంతలోనే సదరు వ్యక్తి మరోమారు ఫోన్‌ చేసి.. ‘ఏమైందమ్మా.. మీ డబ్బులు అక్కరలేదా..? అంటూ హెచ్చరించాడు. వృద్ధురాలి భర్త వెంటనే సైబర్‌ పోలీసులను సంప్రదించారు. అయితే బాధితులు సైబర్‌ పోలీసుల దగ్గరకు వచ్చేలోపే మరో రూ.5 లక్షలు విత్‌డ్రా అయినట్లుగా సందేశం వచ్చింది. దారిలో మినీ స్టేట్‌మెంట్‌ తీసుకుంటే అందులోనూ రెండు విడతలుగా రూ.10 లక్షలు విత్‌డ్రా అయినట్లుగా ఉంది. ఆ రశీదును సైబర్‌ పోలీసులకు చూపించారు. వయోధికురాలి చరవాణిలోని ‘యూనో యాప్‌’లో ఈ-టీడీఆర్‌. ఎస్‌డీఆర్‌లను పరిశీలించగా.. ఆ రూ.10 లక్షలు యూనో యాప్‌లో ‘మై డిపాజిట్‌’ అనే పాకెట్‌లో భద్రంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌ అధికారులను సంప్రదిస్తే ఆ మొత్తాన్ని మీ ఖాతాకు బదిలీ చేస్తారన్నారు.

మరో ఘటనలో రూ.19 లక్షలు..:నగరానికి చెందిన సురేందర్‌రెడ్డికి ఫోన్‌లో వ్యక్తి తాను ఎస్‌బీఐ బ్యాంక్‌ అధికారినని మీ ఖాతాలోంచి రూ.19 లక్షలు విత్‌డ్రా అయిపోయాయన్నాడు. ఇప్పుడేం చేయాలని బాధితుడు ప్రశ్నించగా.. మీకో కోడ్‌ పంపిస్తున్నా.. వెంటనే ఆ నెంబరు చెబితే.. సొమ్మును తిరిగి జమ చేస్తానని చెప్పాడు. అనుమానం వచ్చిన సురేందర్‌రెడ్డి నేరుగా హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. అయితే రూ.19 లక్షలు ఎక్కడికి పోలేదని, బ్యాంక్‌ అధికారులను సంప్రదిస్తే ఖాతాలో జమచేస్తారని పోలీసులు చెప్పారు.

తొందరపడితే ముప్పు..:ఇప్పటివరకు ఎలాంటి ఓటీపీ, ఎస్‌ఎంఎస్‌లు లేకుండానే బ్యాంక్‌ ఖాతాలోంచి డబ్బులు విత్‌డ్రా అయిపోయేవి. ఇటీవల ఎస్‌బీఐ వంటి జాతీయ బ్యాంకులు ఒక్కసారిగా రూ.10 వేలు డ్రా చేస్తే ఓటీపీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఆ ఓటీపీని మరొకరికి చెప్పనంత వరకే మీ డబ్బులు సురక్షితమని పోలీసులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details