రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఇద్దరి కుమార్తెల వివాహం ఘనంగా జరిపించాడు. ఇక మూడో కూతురి పెళ్లి చేస్తే.. బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన గారాలపట్టికి సరిజోడును వెతికాడు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినదంతా.. తన ఆరో ప్రాణమైన కూతురి కోసం ఖర్చు పెట్టాడు. పెళ్లిరోజు దగ్గరపడింది. ఇళ్లంతా బంధువులు, స్నేహితులతో సందడిగా మారింది.
ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుమార్తె.. రేపోమాపో ఇక అత్తారింటికి వెళ్తుందన్న బాధ ఓ వైపు.. తన ముద్దుల కూతురు జీవితంలో ఓ అద్భుతం జరగబోతోందన్న ఆనందం మరోవైపు.. ఇంతలోనే అనుకోని సంఘటన జరిగింది. అకస్మాత్తుగా ఆ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు.
మూడ్రోజుల్లో పెళ్లి ఉందనగా.. ఆస్పత్రి పాలయ్యాడు. నువ్వేం బెంగ పెట్టుకోకు బిడ్డా.. పెళ్లిరోజు వరకు నేను ఆరోగ్యంగా తిరిగొస్తా. నీ పెళ్లి నా చేతుల మీదే అంగరంగ వైభవంగా జరిపిస్తా.. నీ పిల్లలను చూసే వరకు నాకేం కాదు అంటూ తన గారాలపట్టికి ధైర్యం చెప్పాడు. కానీ.. విధి వక్రీకరించింది. ఆ తండ్రి కోరిక.. ఆ కూతురి ఆనందాన్ని రెప్పపాటులో వాళ్లకు దూరం చేసింది. అతణ్ని మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది.
కామారెడ్డి జిల్లా బీర్కూరులో విషాదం(Tragedy) చోటుచేసుకుంది. కుమార్తె వివాహానికి కొన్ని గంటల ముందు తండ్రి మృతి చెందాడు. మూడ్రోజుల కిందట అనారోగ్యానికి గురైన షేక్ గుడ్సాబ్(48) నిజామాబాద్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. సోమవారం రాత్రి గుడ్సాబ్ మూడో కుమార్తె వివాహం జరగనుంది. ఇంటి యజమాని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.