ప్రేమపెళ్లి చేసుకున్నందుకు ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు..! అభివృద్ధి విషయంలో ప్రపంచం ఎన్ని కొత్తపుంతలు తొక్కుతున్నా.. ఇప్పటికీ జరుగుతున్న కొన్ని ఘటనలు సమాజాన్ని ఆగి.. ఆలోచింపజేస్తున్నాయి. పరువు పేరుతో.. కులం పేరుతో.. కట్టుబాట్ల పేరుతో.. ఎన్నో అమానుష ఘటనలు చోటుచేసుకుంటూ.. మనుషుల ఆలోచనా విధానాన్ని ఎత్తిచూపుతూనే ఉన్నాయి. ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న జంటలను విడదీయటమే కాకుండా.. హతమార్చటానికి కూడా వెనుకాడని ఎన్నో సందర్భాలు వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా ప్రేమించి పెళ్లి చేసున్నారని.. ఆ జంటకు విడదీసి.. వరుడి కుటుంబాన్ని ఏకంగా గ్రామం నుంచే వెలివేశారు. ఈ అమానుష ఘటన.. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో జరిగింది.
ఎలాగూ ఒప్పుకోరని తెలిసి..
వంగవీడు గ్రామానికి చెందిన తడకమళ్ల పర్వతరావు చిన్న కుమారుడు ప్రమోద్ పదో తరగతి వరకు చదివి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. కొంత కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్తే.. ఒప్పుకోరని భావించిన ప్రేమ జంట.. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 25న ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలో పెద్దలకు తెలియకుండా.. ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం.. తమకు రక్షణ కావాలని కోరుతూ ఎర్రుపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో.. తమ ఇంట్లోని బంగారం పోయిందంటూ వధువు తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెలివేస్తూ కులపెద్దల తీర్పు..
ఈ క్రమంలో.. కులపెద్దలు పంచాయితీ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కులపెద్దలు అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పమని ప్రమోద్ కుటుంబానికి సూచించారు. అయితే.. ఆ యువతి మాత్రం ప్రమోద్తోనే వెళ్తానని తెగేసి చెప్పేసింది. ఎంత చెప్పినా.. వినకపోవటంతో కులపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువకుడి కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేస్తున్నట్లు కులపెద్దలు తీర్పు ఇచ్చారు. వారితో గ్రామస్థులు ఎవరూ మాట్లాడొద్దని.. మాట్లాడిన వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని హుకూం జారీ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు..
ఇదంతా అయ్యాక.. తమ కుమార్తెను పంపించాలని రాత్రి సమయంలో ప్రమోద్ ఇంటికి అమ్మాయి తరఫు బంధువులు వెళ్లి హడావిడి చేశారు. కోపోద్రిక్తులైన అమ్మాయి తరఫు బంధువులు.. ప్రమోద్ తల్లిదండ్రులపై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి తండ్రి, తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి.. అమ్మాయి తరఫు బంధువులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: