Karnataka bus Accident: కర్ణాటక ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన అర్జున్, సరళ, విహాన్, అనితల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి నుంచి బొల్లారం రీసాలాబజార్ బంజారా విలేజ్ కాలనీలోని వారి నివాసాలకు తరలించారు. తెల్లవారుజామునే మృతదేహాలను తరలించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.
ఒకేసారి రెండు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందడంతో బంజారా విలేజ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కాలనీవాసుల రోదనలు మిన్నంటాయి. విహార యాత్ర కోసమని వెళ్లిన వారు.. విగత జీవులై తిరిగి రావడంతో అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఇదీ జరిగింది..
డ్రైవర్ సహా 35 మందితో కూడిన ఓ ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్ బస్సు బీదర్-శ్రీరంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.