తెలంగాణ

telangana

ETV Bharat / crime

'సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తాన్ని ఖాతాదారుకు చెల్లించాల్సిందే..' - రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు

సైబర్​ మోసానికి గురైన ఎస్​బీఐ ఖాతాదారు కేసులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ కీలక తీర్పునిచ్చింది. కస్టమర్‌ మోసపోయిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ సహా చెల్లించాలని ఆదేశించింది.

The bank has to pay the amount to customer hit by the cyber criminals
The bank has to pay the amount to customer hit by the cyber criminals

By

Published : May 18, 2022, 7:12 AM IST

సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును తన ఖాతాదారుకు ఎస్‌బీఐ చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు వెలువరించింది. కస్టమర్‌ మోసపోయిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ సహా చెల్లించాలంది. సైబరాబాద్‌ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఎం.కె.మిశ్ర.. ఎస్‌బీఐ నుంచి రూ.3 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేలోగా ఆయన డెబిట్‌ కార్డు ఆధారంగా సైబర్‌ నేరగాళ్లు 2013 మే 5 నుంచి 7 వరకూ రూ.1.46 లక్షలు కాజేశారు. దీనిపై బ్యాంకుతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మిశ్ర జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ మొత్తాన్ని 2013 నుంచి వడ్డీ సహా చెల్లించాలంటూ ఫోరం తీర్పునివ్వడంతో ఎస్‌బీఐ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యులు మీనా రామనాథన్‌, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

"2012 నుంచి ఖాతాదారు డెబిట్‌ కార్డు వాడుతున్నారు. రుణం తీసుకున్నాకే అది దుర్వినియోగమైంది. ఫిర్యాదుదారు డెబిట్‌ కార్డును కేవలం నగదు ఉపసంహరణకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎప్పుడూ కొనుగోళ్లకు ఉపయోగించలేదు. సదరు మూడు రోజుల్లో 132 కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇన్ని లావాదేవీలు జరుగుతున్నా కనీస సమాచారం, మెసేజ్‌, ఈ-మెయిల్‌ వంటివి ఖాతాదారుకు తెలియజేయలేదు." అని పేర్కొంది. సైబర్‌ నేరస్థుడిని కనిపెట్టే ప్రయత్నం చేయకుండా పోలీసులే తేల్చాలంటూ ఎస్‌బీఐ చేతులెత్తేయడాన్ని తప్పుబట్టింది. ఎప్పుడూ పేటీఎం వినియోగించని ఖాతాదారు ఖాతాలోకి దాని ద్వారా రూ.600 జమ అయిందని, వీటన్నింటి ద్వారా మోసం చేసిన వ్యక్తిని బ్యాంకు కనిపెట్టడానికి ప్రయత్నించలేదని ఆక్షేపించింది. సరైన నిఘా, పరిశీలన లేకపోవడంతోనే ఖాతాదారు మోసపోయారని, ఇది బ్యాంకు సేవాలోపమేనంది. బ్యాంకు పిన్‌ వంటి రహస్యాలను ఇతరులకు చెప్పడం ద్వారానే మోసం జరిగిందన్న బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. ఖాతాదారు మోసపోయిన రూ.1.46 లక్షలను 2013 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలంటూ జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎస్‌బీఐ అప్పీలును కొట్టివేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details