Terrorists plan Dussehra blasts in Hyderabad: చైనాలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు మెదక్ జిల్లా మనోహరాబాద్ కు ఎలా చేరుకున్నాయి. పాక్ ఉగ్రవాదులు కశ్మీర్లో డ్రోన్ సాయంతో జారవిడిచినా... అక్కడి నుంచి మనోహరాబాద్ కు ఎలా తరలించారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు. కేవలం 4 హ్యాండ్ గ్రనేడ్లే ఇక్కడికి చేరుకున్నాయా... లేకపోతే ఇంకా ఎక్కువ మొత్తం ఇతర ప్రాంతాలకు చేరవేశారా అనే కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ కు ద్విచక్రవాహనంపై వెళ్లి... 4 హ్యాండ్ గ్రనేడ్లను తీసుకొని మరుసటి రోజు నగరానికి చేరుకున్నాడు. మనోహరాబాద్ లో ఎక్కడ గ్రనేడ్లను సమియుద్దీన్ తీసుకున్నాడు... ఆయనకు ఎవరు అప్పగించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఆధారాలు సేకరణ.. సిట్ పోలీసులు ఇప్పటికే అబ్దుల్ జాహెద్కు చెందిన 2 చరవాణిలు, సమియుద్దీన్కు చెందిన ఒక చరవాణి, మాజ్ హసన్ నుంచి రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు .. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ఎవరెవరితో మాట్లాడారనే వివరాలను సేకరిస్తున్నారు. జాహెద్ మూడేళ్ల నుంచి పేలుళ్లకు ప్రణాళిక రచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా పాక్ లో ఉంటున్న లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరితో... సంభాషణలు కొనసాగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా జాహెద్ కోడ్ భాషలో ఫర్హతుల్లా ఘోరితో సంభాషించినట్లు తేల్చారు. సమియుద్దీన్ చరవాణిలో ఉన్న మొబైల్ అప్లికేషన్లలోనూ... నేరుగా ఫర్హతుల్లాతో మాట్లాడినట్లు ఆధారాలు సేకరించారు. కోడ్ భాషను గుర్తించే నిపుణులను సిట్ పోలీసులు సంప్రదించి.. సంభాషణను తేల్చే పనిలో ఉన్నారు.
ఇంత మొత్తంలో ఎవరు డబ్బు అందించారు.. పాక్ నుంచి జాహెద్ కు దాదాపు 33లక్షల రూపాయలు అందినట్లు పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో ఈ డబ్బు జాహెద్కు చేరినట్లు తేల్చారు. ఫర్హతుల్లా ఘోరి ఈ డబ్బులను పలు మార్గాల్లో అందించినట్లు సిట్ గుర్తించింది. అయితే ఎలా ఈ డబ్బులు జాహెద్కు చేరాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని యువకులను ఉగ్రవాదంవైపు ఆకర్షించేలా చేయడానికి డబ్బులు ఖర్చు చేసేందుకు ఘోరి డబ్బులను అందించాడు. జాహెద్ ఈ డబ్బు మొత్తాన్ని ఎక్కడ ఖర్చు చేశాడనే వివరాలు సేకరిస్తున్నాడు. జాహెద్ సోదరుడు మాజిద్ సైతం పాక్ లోనే తలదాచుకుంటూ ఫర్హతుల్లా ఘోరికి సహాయకుడిగా పని చేస్తున్నాడు. మాజిద్ ద్వారా కూడా జాహెద్ కు డబ్బులు చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు.