తెలంగాణ

telangana

ETV Bharat / crime

గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని.. పురుగుల మందు తాగి ఆత్మహత్య - student suicide

Tenth Class Student Suicide: పదోతరగతి పరీక్షలకు రెండు నెలల సమయమే ఉంది. తమ కూతురు బాగా చదివి.. మంచి ఉద్యోగం సాధిస్తుంది అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఇంతలోనే పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరాతీయగా ఒంట్లో బాగాలేదని చెప్పింది. సరేలే తగ్గాక స్కూల్​కు వెళ్తుంది అనుకున్నారు. ల అలా కొంతసమయం గడిచాక.. కూతురు ఏడవటం మొదలుపెట్టింది. కడుపులో నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. అసలే గిరిజన కుటుంబం.. వైద్యంపై అంతగా అవగాహన లేదు. అందుకే భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన వైద్యులను సంప్రదించమని చెప్పడంతో ఆందోళనతో.. అక్కడికి పరుగెత్తారు. పరీక్షించిన వైద్యులు.. అసలు కారణం చెప్పాక షాకయ్యారు. బోరున విలపించారు. ఎందుకిలా చేశావంటూ కూతురిని మందలించారు. దీంతో ఆ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

10th class student suicide
విద్యార్థిని ఆత్మహత్య

By

Published : Mar 30, 2022, 3:49 PM IST

Tenth Class Student Suicide: గిరిజన కుటుంబంలో పుట్టినా.. బాగా చదివి కుటుంబానికి అండగా నిలబడుతుందనుకున్న తమ కూతురు గర్భం దాల్చిందని తెలిసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఎలా జరిగిందని సోదరుడు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కన్న కూతురిని విగతజీవిగా చూసేసరికి ఆమె కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని గర్భం ధరించడం గ్రామస్థులను కలవరానికి గురిచేస్తోంది. కుమార్తె గర్భానికి కారకులెవరో తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక(16) పదో తరగతి చదువుతోంది. కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామం గెద్దమడుగు గ్రామానికి వచ్చింది. అకస్మాత్తుగా కూతురు ఇంటికి వచ్చేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందని ఆరాతీశారు. ఆరోగ్యం బాగాలేదు, కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆ గ్రామంలోని భూత వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. భూత వైద్యం చేసిన గిరిజనుడు.. కడుపులో గడ్డ ఉంది ఆస్పత్రిలో చూపించాలని కుటుంబసభ్యులకు తెలిపాడు.

నాలుగో నెల గర్భిణి: దీంతో భద్రాచలం ఆస్పత్రిలో పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు చెప్పిన మాటలు విని కుటుంబ సభ్యులు షాకయ్యారు. ప్రస్తుతం బాలిక ఇప్పుడు నాలుగో నెల గర్భిణి అని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులు తీవ్రంగా మందలించారు.. దీనికి కారణం ఎవరని అడగడంతో బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఈనెల 27న మృతి చెందింది.

అనేక అనుమానాలు:విద్యార్థిని ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలో చదువు కొనసాగిస్తుండగానే 4 నెలల గర్భిణి ఎలా అయిందన్నది కుటుంబీకులు, గ్రామస్థుల అనుమానం. మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సివుండగా ఇలాంటి విషాదం జరగడం వారిని శోకసంద్రంలో ముంచేసింది. ఆత్మహత్య విషయాన్ని ఆశ్రమ పాఠశాల యాజమాన్యం, ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

కారణం ఎవరో: బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎటపాక మండలం భూపతిరావుపేటగా పోలీసులు గుర్తించారు. యువకుడిని గ్రామస్థులు ప్రశ్నించగా తాను ప్రేమించిన మాట వాస్తవమేనని, ఆమెకు గర్భం రావడానికి తాను కారణం కాదని చెప్పినట్లు సమాచారం. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో పాఠశాల సిబ్బంది ప్రమేయం ఉందా.. లేక బయటి వ్యక్తుల పనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అస్వస్థతకు గురైన బాలిక పట్ల ప్రధానోపాధ్యాయురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే నిండు ప్రాణం బలైందని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు డివిజన్‌ అధ్యక్షుడు సోందె మల్లుదొర ఆరోపించారు. మంగళవారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయురాలిని ఈ అంశంపై నిలదీశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:వీడిన వికారాబాద్ గర్ల్​ మర్డర్​ మిస్టరీ.. అందుకు ఒప్పుకోలేదని..

ABOUT THE AUTHOR

...view details