Tension At Kukatpally: హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు కుటుంబాల వ్యక్తులు.. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో సుల్తాన్, మొయేజ్, ఫాయుమ్లు గాయపడ్డారు. స్థానికులు నచ్చ చెబుతున్నా వినకుండా.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు తీసుకొని రోడ్లపై తిరుగుతూ ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. అనంతరం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదుచేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఓ వర్గానికి చెందిన వ్యక్తి కిరాణా దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తి దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంతలో అక్కడకు సమీపంలోని మసీదు నుంచి బయటకు వచ్చిన ఇరువర్గాల కుటుంబ సభ్యులు సైతం గొడవకు దిగారు. ఇరు కుటుంబాలకు గతంలోనే గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కాలనీ ఎన్నికలు, ఇతర గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉన్న రాళ్లతో దాడి చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. ఇరువురు ఫిర్యాదుచేశారని.. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి సీఐ నర్సింగరావు వెల్లడించారు.
కూకట్‌పల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు ఇదీచూడండి:నడిరోడ్డుపై 'రివెంజ్'.. హత్య కేసు నిందితుడిని ఆరుగురు కలిసి పొడిచి..