Drugs Supply at Anjuna Beach : గోవాలో అంజునాబీచ్‌కు ప్రత్యేకత ఉంది. తక్కువ బడ్జెట్‌లో విందు, వినోదాలను ఆస్వాదించేందుకు అనుకూలంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాలనుంచి వెళ్లే యువకులు, ఐటీ నిపుణులు అక్కడే విడిది చేస్తారు. ఇటీవల మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన ప్రితీష్ బోర్కర్, మంజూర్ అహ్మద్ నుంచి సేకరించిన వివరాల్లో పలు ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. వికాస్ నాయక్ అలియాస్ విక్కీ, రమేష్ చౌహాన్, స్టీవ్, ఎడ్విన్, సంజ గోవెకర్, తుకారాం సల్గాంకర్ అలియాస్ నాన మత్తుపదార్థాల వ్యాపారంలో కీలక సూత్రధారులు. వీరి కనుసన్నల్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మత్తుపదార్థాల కోసం గోవాకు వెళ్లే ఏజెంట్లు, కొనుగోలుదారులకు వీరు పరిచయస్తులు. వీరి ద్వారానే కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తారని నగర పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఆరుగురు సుమారు 8 ఏళ్లుగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు సాగిస్తున్నట్టు భావిస్తున్నారు.
Drugs Supply at Anjuna Beach : తెలుగోళ్లు డ్రగ్స్ అక్కడే కొంటున్నారట..! - గోవాలోని అంజునా బీచ్‌లో డ్రగ్స్ సరఫరా
Drugs Supply at Anjuna Beach : మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మత్తు మాఫియా సరఫరాను పకడ్బందీగా కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గోవా కేంద్రంగా సాగుతున్న దందా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ) బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. డార్క్‌నెట్‌లో సాగుతున్న లావాదేవీలపై 2 నెలలుగా కన్నేసిన పోలీసు యంత్రాంగం డెకాయ్ ఆపరేషన్‌తో కీలకసూత్రధారులను గుర్తించగలిగింది. గోవా వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అరెస్టయిన వారిలో అధికంగా 11మంది విదేశీయులు ఉండటం విశేషం.
![Drugs Supply at Anjuna Beach : తెలుగోళ్లు డ్రగ్స్ అక్కడే కొంటున్నారట..! Drugs Supply at Anjuna Beach](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16313265-1059-16313265-1662611818101.jpg)
Drugs Supply at Anjuna Beach in Goa : డ్రగ్స్‌కు అలవాటుపడి కొనేందుకు డబ్బుల్లేని యువకులు సంపాదన కోసం విక్రయదారులుగా మారుతున్నారు. డార్క్‌వెబ్ సహాయంతో దేశ, విదేశాల నుంచి సరకును కొరియర్ ద్వారా కొనుగోలుదారులకు చేరవేస్తున్నారు. రష్యా, అమెరికా, హాలెండ్ తదితర దేశాల నుంచి సముద్రమార్గంలో గోవా చేరిన మత్తుపదార్థాలు డీలర్లకు చేరతాయి. వారు ప్రధాన విక్రయదారులకు విక్రయిస్తారు. చేతులు మారేకొద్దీ ధర పెరుగుతుంది. ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ ఒక్కొక్కటి రూ.150-200 అసలు ధర అయితే ఏజెంటుకు రూ.1,500 కొనుగోలుదారు వద్దకు చేరేసరికే రూ.3,000-3,500 అవుతుంది. కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటివి కూడా 10-20 రెట్లు అధికంగా విక్రయిస్తారని చెబుతున్నారు. నిందితుల ఫోన్లు, వాట్సాప్ జాబితాలో 600 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. వీరిలో 174 మంది పెద్దఎత్తున కొన్నట్లు నిర్ధారించారు.
సాంకేతికత తోడుతో.. మత్తుమాఫియా సూత్రధారులను బయటకు రప్పించేందుకు నగర సీపీ సీవీఆనంద్ సారథ్యంలోని హెచ్‌న్యూ బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డార్క్‌వెబ్.. సాధారణ వెబ్‌సైట్లు మాదిరిగా అంతర్జాలంలో వెతకడం సాధ్యం కాదు. ప్రత్యేక బ్రౌజర్‌ను ఉపయోగించాలి. మాదకద్రవ్యాలు విక్రయిస్తూ/వినియోగిస్తూ చిక్కిన నిందితులను లావాదేవీలు నిర్వహించేందుకు పావులుగా ఉపయోగించారు. వారి ద్వారా పెద్దఎత్తున మాదకద్రవ్యాలు కొనుగోలు చేయించారు. సూత్రధారుల అసలు చిరునామా, లావాదేవీలకు ఉపయోగించే కిటుకులను పసిగట్టారు. అవన్నీ వాస్తవాలని నిర్ధారించుకున్నాక గోవా వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితులు దొరికితే మరింత కీలక సమాచారం బయటకు వస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.