Shilpa Chowdary Cheating Case : మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరి మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్ పేరుతో జూదశాలను నిర్వహించిందని సాక్ష్యాధారాలు సేకరించారు. ఇందులో 90 మంది సెలబ్రిటీల కుటుంబాల మహిళలున్నారని గుర్తించారు. శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ.కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
Shilpa Chowdary Case Updates : గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది. తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చింది. దివానోస్ పేరుతో జూదశాలను ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో 90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది. వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.
Shilpa Chowdary Case News : శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని తన వద్ద నుంచి రూ. 2 కోట్లకు పైగా నగదు తీసుకుని శిల్పాచౌదరి మోసం చేసిందంటూ కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని నార్సింగి పోలీసులు తెలిపారు. శిల్పాచౌదరిని నార్సింగి పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు. శిల్పాచౌదరి కస్టడీ పిటిషన్‌పై నేడు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరగనుంది.