తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hyderabad Theft case: అత్త ఇంటికి అల్లుడు కన్నం.. చివరకు పోలీసులకు చిక్కాడు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Hyderabad Theft case : అత్త కాశీ యాత్రకు వెళ్లింది. ఇదే అదునుగా భావించాడు ఆ అల్లుడు. ఎవరూ లేని సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. ఇంట్లో ఉన్న కిలోకు పైగా బంగారం, నగదును కాజేశాడు. ఏమీ తెలియనట్లు తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

MK Nagar Theft case, Hyderabad Theft case
అత్త ఇంటికి అల్లుడు కన్నం

By

Published : Dec 3, 2021, 5:27 PM IST

Hyderabad Theft case : హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఓ ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కాశీయాత్రకు వెళ్లిన రంగమ్మ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న లక్ష్మణ్‌ ఇంట్లో లాకర్‌ పగలగొట్టి కేజీ బంగారం... రూ.12 లక్షల నగదు దోచుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పక్కా ఆధారాలతో నిందితుడు లక్ష్మణ్‌ను పట్టుకున్నారు. పెయింటర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ చెడు వ్యసనాల బారిన పడి డబ్బులు సరిపోక చోరీలకు తెగించాడని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు

ఏం జరిగింది?

ఓయూ పీఎస్ పరిధిలో జరిగిన చోరీని చేధించారు. అత్త ఇంటికి అల్లుడు కన్నం వేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకే నగర్​లో జోగిని రంగమ్మ నివాసం ఉంటోంది. తన చెల్లెలు కూతురిని దత్తత తీసుకున్న రంగమ్మ... దూరపు బంధువుకు ఇచ్చి వివాహం చేసింది. పెంచిన కూతురు, అల్లుడు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అల్లుడు లక్ష్మణ్ పెయింటర్​గా పనిచేస్తున్నాడు.

రంగమ్మ నవంబర్ చివరి వారంలో తీర్థయాత్రల కోసం కాశీకి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లోని లాకర్ తాళం పగలగొట్టి ఉంది. ఆమెకు గుర్తుఉన్న మేరకు రెండు ఆభరణాల గురించి చెప్పింది. అవి రెండు మొత్తం 105 తులాలు ఉన్నాయి. ఆ బంగారం, రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాం. ఈ చోరీకి ఒక డ్రిల్లింగ్ మెషీన్, స్క్రూ డైవర్ వాడాడు. ఓ ప్రొఫెషనల్ వర్కర్​లాగే వాడాడు. కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకొని వేరే నేరాల్లో ఇంకా ఏమన్నా ఉన్నాడా? అనే విషయంపై దర్యాప్తు చేస్తాం.

-ఉస్మానియా పోలీసులు

'అనుమానమే నిజమైంది'

గత నెల చివరి వారంలో రంగమ్మ కాశీ యాత్రకు వెళ్లింది. తిరిగొచ్చే సరికి ఇంట్లో ఉన్న కిలోకు పైగా బంగారంతో పాటు.. నగదు చోరీ అయినట్లు గుర్తించింది. ఈమేరకు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అల్లుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లక్ష్మణ్ చోరీ చేసే సమయంలో... ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. చోరీ అనంతరం తప్పించుకు తిరుగుతున్న లక్ష్మణ్​ను పోలీసులు అరెస్ట్ చేసి... రిమాండ్​కు తరలించారు. నిందితుడి నుంచి 105తులాల బంగారం, రూ.12లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

రంగమ్మ అలియాస్ జోగిని రంగమ్మ. ఆమె ఉస్మానియా క్యాంపస్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఒక కేజీ బంగారు ఆభరణాలు, నగదు ఉన్నాయి. పెయింటర్​గా పనిచేసే లక్ష్మణ్ ఆ సొత్తును కాజేశాడు. బంగారం, నగదు రికవరీ జరిగింది.

-అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

అత్త ఇంటికి అల్లుడు కన్నం

ఇదీ చదవండి:Corona cases in telangana : విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details