Khiladi Lady Cheating : జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళ(35) రెండుసార్లు వివాహం చేసుకుని ఇద్దరితోనూ విడిపోయి కరీంనగర్లో ఒంటరిగా నివసిస్తోంది. ప్రస్తుతం మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. నగరంలోని తిరుమలనగర్లో నివాసముంటున్న ఈ మహిళ.. కష్టపడకుండా బాగా డబ్బు సంపాదిచాలనుకుని పక్కదారులు పట్టి చివరకు పోలీసులకు చిక్కింది.
మాటలతో మాయ..
Cheating with FB profiles : ఫేస్బుక్లో యువతీయువకుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి వారికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి నెమ్మదిగా వారితో మాట కలుపుతుంది. కాస్త స్నేహం కాగానే తీయని మాటలతో మాయ చేస్తుంది. ఆమె వలపు వలలో పడిన బాధితులు ఆమె చెప్పేవన్ని నిజాలనుకుని నమ్మేస్తారు. అలా వారిని మచ్చిక చేసుకున్న తర్వాత.. తన కుటుంబం కష్టాల్లో ఉందంటూ వారి నుంచి నెమ్మదిగా డబ్బు దండుకుంటుంది. ఇలా ఆమె చేతిలో యువకులే కాదు యువతులు కూడా మోసపోయారు.
గొంతు మార్చి మాట్లాడి..
Khiladi Lady honey trap : గొంతు మార్చే యాప్లతో యువతులకు ఫోన్ చేసి అబ్బాయిలా మాట్లాడుతూ వారికి వలపు వల వేస్తుంది. వాళ్లు నమ్మారని అర్థమయ్యాక తన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగాలేదనో లేక ఆర్థికంగా నష్టాల్లో ఉన్నామనో నమ్మబలికి ఆ అమ్మాయిల నుంచి నగదు కాజేస్తుంది. ఆ తర్వాత వారితో కాంటాక్ట్ కట్ చేస్తుంది. చివరకు మోసపోయామని గ్రహించిన అమాయకు ఆడపిల్లలు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించగా అసలు కథంతా బయటపడింది. ఇలా ఆమె చేతిలో ఇప్పటి వరకు చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 34 నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి అమాయకులకు ఎర వేసిందని తెలిపారు.