PD Act against Gambling Organiser : పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫాం హౌస్‌లో పేకాట నిర్వహిస్తూ గుత్తా సుమన్ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డారు. సుమన్‌పై గతంలోనూ గచ్చిబౌలి, పంజాగుట్ట పీఎస్ ల్లోనూ కేసులున్నాయి. గుత్తా సుమన్‌పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పీడీ చట్టం ప్రయోగించారు. పీడీ చట్టం ప్రయోగించడంతో గుత్తా సుమన్ ఏడాది పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటారు. పీడీ చట్టం వల్ల బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉండదు.
ఎవరీ గుత్తా సుమన్..?
Gutta suman cases: విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు. ‘సుమన్‌కుమార్ చుట్టూ బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతుంటాడు. పెద్దవాళ్లతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూకబ్జాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫాంహౌస్‌లు, స్టార్‌హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంప్(casino hyderabad news)లను ఏర్పాటుచేసే స్థాయికొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటుచేశాడు. స్థిరాస్తి వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్ ఛానెల్‌కు డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.