తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime Today : సైబర్​ కేటుగాళ్ల నయా పంథా.. అద్దె ఇళ్ల నుంచే మోసాలు

Cyber Crime Today : మెట్రో నగరాల్లో సైబర్, ఆర్థిక నేరాలు చేస్తున్న వారు పోలీసుల దృష్టి మళ్లించేందుకు జనం ఎక్కువగా ఉండే అపార్ట్​మెంట్లలో ప్లాట్లు, ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కణ్నుంచి వారి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకుండా నకిలీ ఏజెన్సీలు, డొల్ల కంపెనీలు తెరిచి నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వెళ్లి చూస్తే.. అక్కడ కంపెనీలుండవు. యజమానులను అడిగితే.. సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామని అద్దెకు దిగారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో నగరాల్లో సొంత ఇళ్లు, ప్లాట్లు ఉన్న యజమానులు జాగ్రత్తగా ఉండాలని.. కిరాయికి ఇచ్చే ముందు వివరాలు సరిచూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Cyber Crime Today, cyber crimes in telangana, సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు
అద్దె ఇళ్ల నుంచే సైబర్ మోసాలు

By

Published : Dec 4, 2021, 7:06 AM IST

Cyber Crime in Hyderabad : మెట్రో నగరాల్లో సొంత ఇల్లు, ఫ్లాట్లు ఉన్న యజమానులు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులకు కిరాయికి ఇచ్చినా, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్నా, ప్రముఖ కంపెనీలకు ఒప్పంద ప్రాతిపదికన సేవలు అందిస్తున్నామని చెప్పినా.. వివరాలను సరిచూసుకోవాలని వివరిస్తున్నారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడి వివరాలను సేకరించి బెంగళూరుకు వెళ్లారు. బాధితుడి నుంచి కాజేసిన సొమ్ము గ్రూ టెక్నాలజీస్‌కు వెళ్లిందని తెలుసుకుని ఆ చిరునామాకు వెళ్లగా.. అక్కడ ఒక వైద్యనిపుణుడు ఉన్నారు. ఇక్కడ కంపెనీ ఉండాలి కదా? అని ప్రశ్నించగా..‘ఈ ఇల్లు నాది.. కిరాయికి ఇచ్చాను.. వారు ఖాళీ చేసి వెళ్లార’ని వివరించారు. పోలీసులు పరిశోధించగా.. వైద్య నిపుణుడి ఇంటి నంబరు మీద 200 కంపెనీలను రిజిస్టర్‌ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయనకు తాఖీదులు ఇచ్చి హైదరాబాద్‌కు రావాల్సిందిగా సూచించారు.

డొల్ల కంపెనీలు.. నకిలీ ఏజెన్సీలు

Cyber Crime News Today : మెట్రో నగరాల్లో సైబర్‌, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఇటీవల బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, జనం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు.ఆ చిరునామా తో డొల్ల కంపెనీలు, నకిలీ ఏజెన్సీలను తెరుస్తున్నారు. వాటికి ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయరు. రుణ యాప్‌లతో రూ.30 వేల కోట్లు కొల్లగొట్టిన చైనీయులు..దిల్లీలో 29 కంపెనీలు ప్రారంభిస్తే అందులో 12 కంపెనీలు ఒకే చిరునామాపై ఉన్నాయి. మెయిల్‌ హ్యాకింగ్‌ ద్వారా మోసం చేస్తున్న సైబర్‌ నేరస్థుల చిరునామాలన్నీ ముంబయి, చెన్నై, బెంగళూరులోని అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. దిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉంటున్న సైబర్‌ నేరస్థుడిని పట్టుకుంటే మాదాపూర్‌, బేగంపేటలలో కార్యాలయాలున్నాయని తేలింది.

యజమానులేం చేయాలి?

Cyber Crimes from Rented House : ఇల్లు, ఫ్లాట్‌ కిరాయికి ఇచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఆధార్‌, ఓటర్‌ గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ ఖాతా నకలు ప్రతులు తీసుకోవాలి. మోసం చేసేవారు కచ్చితంగా నకిలీవి తయారు చేస్తారు. అంతర్జాలంలో వాటిని సరిపోల్చుకున్నాకే ఫ్లాట్‌, ఇల్లు అద్దెకు ఇవ్వాలి.

Telangana Cyber Crimes : ఇంటర్నెట్‌ కనెక్షన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సామర్థ్యం, వినియోగ సమయం తెలుసుకోవాలి. 24 గంటలు ఇంటర్నెట్‌ వాడుతున్నా.. పనిచేస్తున్నట్లు కనిపించినా ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి.

Today Cyber Crimes : సైబర్‌ నేరస్థులు ఇల్లు, ఫాట్లలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశాలున్నాయి. అల్పాహారం, భోజనాన్ని ఆన్‌లైన్‌ డెలివరీ ద్వారా తెప్పించుకుంటారు. ఇలాంటి అంశాలను గమనించి పనిచేస్తున్న కంపెనీ, పనివేళల వివరాలు తెలుసుకోవాలి.యజమాని మరోచోట ఉన్నా తరచూ ఇంటిని సందర్శిస్తూ పర్యవేక్షిస్తుండాలి. అవసరమైతే అపార్ట్‌మెంట్‌/కాలనీ సొసైటీ సభ్యుల, సహ యజమానుల సహకారం తీసుకోవాలి.

కాలనీ, అపార్ట్‌మెంటుకు విధి నిర్వహణలో భాగంగా వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌, బ్లూకోల్ట్స్‌ బృందాలతో మాట్లాడాలి. అద్దెకు ఉంటున్న వారిని పిలిచి పోలీస్‌ అధికారులను పరిచయం చేస్తే మోసం చేసే వారిలో కంగారు కనిపించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details