హైదరాబాద్ ముషీరాబాద్ రిసాలగడ్డలోని తాగునీటి ట్యాంకులో లభించిన మృతదేహం కేసులో... మృతుడిని పోలీసులు, అతని కుటుంబసభ్యులు గుర్తించారు. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన కిశోర్‌గా వెల్లడైంది. గత నెల 23నుంచి అతను కనిపించడంలేదంటూ కుటుంబసభ్యులు పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే తాగునీటి ట్యాంక్ వద్ద లభించిన చెప్పులు మాత్రం కిశోర్ స్నేహితుడివిగా బయటపడింది. కిశోర్, అతని స్నేహితుడు కలిసి తరుచూ నీటి ట్యాంక్ వద్దకు చేరుకుని మద్యం, గంజాయి వంటివి సేవిస్తుంటారని దర్యాప్తులో తేలింది. అయితే కిశోర్‌ది ఆత్మహత్య, హత్య లేదా ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కిశోర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది.. చెప్పులు ఎందుకు నీటి ట్యాంకు వద్ద ఉన్నాయి.. కిశోర్ మృతదేహం లభించిన నీటి ట్యాంక్ రెండు మూతలు కూడా మూసివేసి ఉండటంతో పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
వైద్య పరీక్షలు
మృతదేహం ఉన్న ట్యాంకులోని నీటిని స్థానికులు 20రోజులుగా తాగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిసాలగడ్డలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వైద్య బృందం తిరిగి పర్యటించింది. స్థానికులెవరైనా అనారోగ్యం బారిన పడ్డారా.. పరిస్థితి ఏ విధంగా ఉందంటూ వైద్యులు ఆరా తీశారు. స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనారోగ్యం బారిన పడిన వారు వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిశోర్ మృతిపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఫిర్యాదులు చేసినా
కిశోర్ అదృశ్యంపై 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల కనిపించకుండా పోయిన వ్యక్తుల కేసులపై పోలీసులు ఆరా తీశారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులపై దృష్టిసారించారు. నీటి ట్యాంక్‌లో కుళ్లిన మృతదేహం లభ్యమవగా.. చనిపోయింది అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్ అని పోలీసులు నిర్ధరించారు. స్థానికులు ఇదే ట్యాంకులోని నీటిని తాగుతుండటంతో ఆందోళన చెందారు. నీళ్లు దుర్వాసన వస్తున్నాయని జలమండలి అధికారులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఉంటే మృతదేహాన్ని ముందే గుర్తించేవారని స్థానికులు చెబుతున్నారు.